'బాహుబలి', 'ఘాజీ' వంటి సూపర్ హిట్స్ ద్వారా ఫామ్‌లో ఉన్న దగ్గుబాటి రానా తేజ దర్శకత్వంలో 'నేనే రాజు నేనే మంత్రి' అని పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రం చేయనుండటం. ఈ మద్య చిత్రాలు నిర్మించడం తగ్గించిన ఆయన తండ్రి సురేష్‌బాబు ఈ చిత్రం నిర్మించడంతో సహజంగానే ఆసక్తి మొదలైంది. ఇక తేజ అంటే లో బడ్జెట్‌లో, పరిధి మేరకే తీస్తాడు.. దీనికితోడు రానాకి తెలుగుతో పాటు తమిళం, హిందీలలో కూడా గుర్తింపు ఉండటంతో ఇది బాగానే వర్కౌట్ అవుతుందనే భావించవచ్చు.
ఇక రానా గత పుష్కరకాలంగా హిట్‌లేని, ఆయన కిందటి చిత్రం 'హోరాహోరి' డిజాస్టర్ కావడంతో చిన్న హీరోలు కూడా తేజతో చేయడానికి ముందుకు రాకపోయినా రానా ముందుకు రావడం అభినందనీయమే. దీని గురించి రానా మాట్లాడుతూ, నేను దర్శకుల ట్రాక్ రికార్డులను పట్టించుకోను. కథలో కొత్తదనం, సత్తా ఉన్నాయా? లేదా? అని మాత్రమే చూస్తాను. నేను 'బాహుబలి' చేసింది కూడా రాజమౌళిని చూసికాదు. ఈ చిత్రం సబ్జెక్ట్‌లో ఉన్న దమ్ము చూసే. రాజమౌళి కంటే నా దృష్టిలో 'బాహుబలి'నే గ్రేట్. ఇక 'ఘాజీ'ని కూడా కొత్త దర్శకుడైన సంకల్ప్‌రెడ్డిని చూసి చేయలేదు. ఆయన తయారు చేసుకున్న కథతో వైవిధ్యం ఉంది అని చెప్పాడు.
ఇక 'నేనే రాజు నేనే మంత్రి'చిత్రం లాంగ్ వీకెండ్ రావడంతో ఆగష్టు 11న విడుదల కానుంది. తెలుగుతో పాటు ఈ చిత్రం తమిళంలో కూడా ఒకేసారి విడుదల కానుంది. కానీ ఆగష్టు10న ముందురోజే స్టార్ అజిత్ 'వివేగం' ఉండటంతో తమ చిత్రం తమిళంలో ఇబ్బంది పడుతుందని భావించారు. కానీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న'వివేగం' చిత్రం రెండు వారాలు వాయిదా పడి, ఆగష్టు 24కి పోస్ట్‌పోన్ కావడం 'నేనే రాజు.. నేనే మంత్రి' టీమ్ కి రిలీఫ్ అనే చెప్పాలి.