చిన్న సినిమాలను, విడుదలకు నోచుకోని చిత్రాలను దిల్‌రాజు పంపిణీ చేస్తే దాన్నంతట అదే క్రేజ్ సంపాదించుకుంటుందని ఎందరో హీరోలు, దర్శకనిర్మాతలు భావిస్తుంటారు. కనీసం ఆయన ఒక ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసినా ఆయనకున్న గుడ్‌విల్‌తో ప్రేక్షకులలోనే కాదు.. ఇతర ఏరియాల పంపిణీదారుల్లో కూడా కాస్త ఊపు వచ్చి బిజినెస్ జరుగుతుంది. దాంతో అందరూ దిల్‌రాజు దృష్టిలో పడాలని, ఆయన చేతుల్లో తమ చిత్రాలను పెట్టాలని చూస్తారు. ఆయన రిలీజ్ చేసిన డబ్బింగ్ చిత్రాలు మినహా ఆయన సినిమా చూసి బాగుందని ఫీలై తీసుకున్న ప్రతి చిత్రం ఆయనకు లాభాల పంటనే పండించింది.
'డిజె' వంటి మామూలు కంటెంట్ ఉన్నచిత్రం కూడా అంత గొప్ప ఓపెనింగ్స్, కలెక్షన్లు సాధించడానికి దిల్‌రాజు కూడా ఓ ముఖ్యకారణం. ఇక 'ఫిదా'తో ఆయన ఇప్పుడు యమా జోరు మీదున్నాడు. ఇక ప్రస్తుతం కామెడీ హీరో సునీల్, 'ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' వంటి ఫీల్‌గుడ్ చిత్రాల దర్శకుడు క్రాంతిమాదవ్ దర్శకత్వంలో 'ఉంగరాల రాంబాబు' చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం నాలుగైదు సార్లు విడుదల తేదీని మార్చుకుంది. ఫీల్‌గుడ్ డైరెక్టర్ అయిన క్రాంతిమాదవ్ సునీల్ దారిలోకి వెళ్లి కామెడీ పండించాలని చూసినట్లు ఈ చిత్రం ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. కానీ ఈ ట్రైలర్ ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకి చూపించి, ఆయన చేతిలో చిత్రాన్ని పెట్టాలని హీరో, దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఆల్‌రెడీ రిలీజ్ డేట్‌ని కూడా ఆగష్టు 18కి ఫైనల్ చేశారు.
గతంలో సునీల్‌తో దిల్‌రాజు 'కృష్ణాష్టమి' తీసి తన మీద తనకు ఉన్న నమ్మకంతో ఈచిత్రం రివ్యూలని, రేటింగ్‌లను కూడా ఆయనే ఇచ్చుకున్నాడు. ఆ చిత్రంతో ఆయన బోల్తాపడ్డాడు. మరి ఆయన మరోసారి ధైర్యం చేసి సునీల్ 'ఉంగరాల రాంబాబు'ని తన భుజాలపైకి ఎత్తుకుంటాడా? సినిమా చూసిన తర్వాత ఆయన తీసుకునేది, లేనిది అనే దాని బట్టి ఈ చిత్రం ఫలితాన్ని ముందుగానే డిసైడ్ చేయవచ్చని పంపిణీదారులు, విశ్లేషకులు భావిస్తున్నారు.