తాజాగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ తర్వాత పవన్ చెప్పిన మాటలు ఒకవైపు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూనే నిరాశను కూడా కలిగించాయి. ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని, వారంలో మూడు రోజులు కేవలం రాజకీయాలు, ప్రజాసమస్యల కోసమే కేటాయిస్తానని చెప్పాడు అక్టోబర్ కల్లా తన సినిమా కమిట్‌మెంట్స్ పూర్తవుతాయని, ఇక ఆపై పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడమే తన ముందున్న లక్ష్యంగా తెలిపాడు.
పాదయాత్రలు, రోడ్‌షోలపై కూడా సానుకూల స్పందన వ్యక్తం చేశాడు. అంటే ఎంతకాదన్నా ఆయన అక్టోబర్ నుంచి రాజకీయాలకే కేటాయిస్తే ఆయన వచ్చే ఎన్నికలు జరిగే 2019 దాకా అయినా సినిమాల జోలికి వెళ్లకపోవచ్చు. ఆ తర్వాత ఎన్నికల తదుపరి ఫలితాలపై ఆయన నిర్ణయం ఆధారపడి ఉండవచ్చు. ఆ విధంగా చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ - రాధాకృష్ణలతో చేసే చిత్రమే ఆయనకు తాత్కాలికంగా చివరి చిత్రం అవుతుందని, ఆ తర్వాత భారీ గ్యాప్ తప్పదని అనుకోవచ్చు.
ఇక వారంలో మూడు రోజులు ఆయన రాజకీయాలకే కేటాయిస్తే మిగిలిన నాలుగు రోజుల్లో ఒక రోజు పర్సనల్ పనులు, రెస్ట్ తీసుకున్నా మిగిలిన మూడు రోజులు తాను నితిన్‌తో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్‌లో నిర్మించే చిత్రాలతో నిర్మాతగా బిజీ అవుతూ, రాజకీయ ప్రణాళికలకే కేటాయించాల్సి వస్తుంది. ఒకవైపు తమ అభిమాన హీరో రాజకీయాలపై దృష్టి పెట్టడం సంతోషాన్ని కలిగిస్తుంటే.. ఆయన సినిమాలకు దూరం కానున్నాడనే వార్తలు ఆయన అభిమానులకు నిరుత్సాహానే కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.