తాను చేస్తున్న చిత్రం అక్టోబర్ కల్లా పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలలో చురుకుగా పాల్గొంటానని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ నుంచి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని చెప్పారు. ప్రస్తుతం విభజన రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలను విడదీసే రాజకీయాలంటే తనకు భయం వేస్తోందన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన అన్యాపదేశంగా ప్రస్తావించారు. సమాజంలో విభజించి పాలించే రాజకీయాలు చాలానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాపు కులం వాడినని,కానీ చిన్నతనం నుంచి తనకు కుల, మతాలు అంటే పట్టవని ఆయన చెప్పారు. ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత మాట్లాడక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారని, ముద్రగడ శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే అనుమతించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. పలకరించడానికి వెళ్తే దానిని శాంతిభద్రతల సమస్యగా భావించడం బాధాకరమన్నారు.
కాపులకు రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు బిసీ సంఘం అద్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో సహా ఎవ్వరూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడే దీనిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మనస్ఫూర్తిగా విషయాలను అర్ధం చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్‌తోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. నాకు కులాన్ని ఆపాదించవద్దని ఆయన మరీ మరీ కోరారు. నంద్యాల ఉప ఎన్నికలపై తన వైఖరిని రెండు రోజుల్లో చెబతానని, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రత్యేకహోదా విషయాన్ని కావాలనే నిర్వీర్యం చేశారని, ప్రత్యేకహోదాపై తన పోరాటం ఆగదని అన్నారు. గోదావరి అక్వా పార్క్ విషయంలో నిబంధనలు పాటించాలని, నిబంధనలను పాటిస్తుంటే వాటిని ప్రజలకు విడమర్చి చెప్పాలని సూచించారు.
పాదయాత్ర చేస్తారా? అని ప్రశ్నిస్తే, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రలు ఉపయోగపడతాయని, జనసేన కార్యకర్తలు సహకరిస్తే పాదయాత్ర, రోడ్‌షో, మీడియాతో మాట్లాడటం, ఆయా ప్రాంతాలలోని మేధావులతో చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. గరపగర్రు అంశం చాలా సున్నితమైనదని, దానిని తాను రాజకీయం చేయనన్నారు. ఇలాంటి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని, సామాజిక బహిష్కరణ పెద్ద నేరమని, అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలసి పనిచేశారని, ఆయనను కూడా ఓ కులానికి పరిమితం చేయడం కంటే బాధాకరం మరోటి ఉండదన్నారు. అంబేడ్కర్ వంటి మహనీయుడిని కూడా ఓ వర్గానికి, మతానికి పరిమితం చేయడం బాధాకరమని, ఆయన ఏ ఒక్క వర్గానికో నాయకుడుకాదని, ఆయన మన ప్రియతమ నాయకుడని, అల్లూరి సీతారామరాజు కూడా అందరి వాడని ఆయన ఉద్వేగంగా అన్నారు.