విక్టరీ వెంకటేష్ 'గురు' చిత్రం తర్వాత ఇప్పటి వరకు మారె ప్రాజెక్ట్ కనీసం పట్టాలెక్కించడం సరే.. కనీసం ఫైనలైజ్ కూడా చేయకపోవడంతో ఆయన అభిమానుల్లో నిరుత్సాహం ఆవరిస్తోంది. కానీ లేట్‌గా వచ్చినా లేటెస్ట్ న్యూస్‌తో వచ్చాడు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కూడా ఇప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో గత కొంతకాలంగా దగ్గుబాటి అభిమానులు బాబాయ్-అబ్బాయ్‌లు కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు.
ఈసారి తన ఫ్యాన్స్ కోరికను వెంకీ తీర్చే విధంగానే కనిపిస్తున్నాడు. ఇటీవల తమిళంలో వచ్చి ఘనవిజయం దిశగా సాగిపోతోన్న 'విక్రమ్ వేద' రీమేక్‌లు వెంకీ-రానాలు నటించనున్నట్లు సమాచారం. ఇందులో మాధవన్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా, నిజాయితీ ఉన్నపోలీసు అధికారిగా నటించగా, విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించాడు. కాగా తెలుగులో ఈ చిత్రం రీమేక్‌లో మాధవన్ పాత్రను వెంకటేష్, విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ని రానా పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావించిన వెంటనే మా మొదటి చాయిస్‌గా వెంకీ, రానాలే కనిపించారని యూనిట్ కూడా పేర్కొంది.
అయితే ఇది ఇంకా చర్చల స్థాయిలోనే ఉంది. మరో నెలరోజుల్లో గానీ ఫైనల్ విషయం కన్‌ఫర్మ్ చేయలేం. ప్రస్తుతం వెంకటేష్, రానాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని యూనిట్ వర్గాలు తెలిపాయి. త్వరలో ఈ విషయాలను అధికారికంగా మీడియాకు వెల్లడిస్తాం అని వారు పేర్కొనడం విశేషం. ఈ చిత్రానికి భార్యా భర్తలైన పుష్కర్-గాయత్రి ద్వయం దర్శకత్వం వహించింది. విక్రమ భేతాళ కథల ఆధారంగా ఈ చిత్రం కథ రూపొందింది. విక్రమ్‌గా మాదవన్, బేతాళుడిగా విజయ్ సేతుపతి పాత్రలను మలిచారు. దీనిపై తమిళ 'విక్రమ్ వేద' నిర్మాత శశికాంత్ స్పందించారు.
ఇప్పుడే ఈ విషయంపై స్పందిచడం తొందరపాటే అవుతుంది. చర్చలు జరుపుతున్న మాట వాస్తవం. ఓ నెలరోజుల్లో అసలు విషయం తెలుస్తుంది అంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే తమిళంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయమే దీనికి తెలుగులో కూడా దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.