తనకు ఏది తోస్తే, ఏది నిజమని భావిస్తే దానిని ఎంతటి వారినైనా ఓ ఆటాడుకునే రకం కమల్ హాసన్. అధికారం, పదవి వంటి విషయాలను ఆయన అసలు లెక్కచేయడు. దీని కారణంగానే కమల్ హాసన్‌ని నాటి ముఖ్యమంత్రి జయలలిత 'విశ్వరూపం' సందర్భంగా విడుదలలో ఇబ్బంది పెట్టిందని వార్తలు వచ్చాయి. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత తన కెరీర్‌ను తొక్కేయాలనే ఉద్దేశ్యంతోనే 'విశ్వరూపం' విడుదల సమయంలో ముస్లిం సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతింటాయనే సాకుతో తనను నానా విధాలుగా ఇబ్బంది పెట్టిందని, దాంతోనే నేను నాడు రాష్ట్రం వదిలి, దేశం వదిలి వెళ్లిపోతానని చెప్పింది జయను ఉద్దేశించే అని ఆయన స్పష్టం చేశారు.
ఇక జయలలిత మరణం తర్వాత తమిళనాడు ప్రజలు అమ్మగా పిలుచుకునే ఎందరో ఆమెకు వీరాభిమానులు ఉన్నారు. మరి చనిపోయిన జయలలితపై కమల్ చేసిన ఆరోపణలకు వారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇంకా ఆయన మాట్లాడుతూ, మన దేశంలో వాక్ స్వాతంత్య్రం ఉంది. ఏదైనా నచ్చకపోతే విమర్శించే హక్కును రాజ్యాంగం మనకి ఇచ్చింది. రేపు రాజకీయాలలోకి రజినీకాంత్ వచ్చి ఏదైనా నచ్చని పని చేసినా ఆయన్నుకూడా విమర్శించడానికి నేను వెనుకాడను అంటూ మరో బాంబ్ పేల్చారు.
ఇక తాను రాజకీయాలలోకి వస్తున్నానని ఫ్యాన్స్ ప్రచారం చేయవద్దని, తనకు ఇప్పుడు ఆ ఆలోచన లేదన్నారు. ఇక మీకు చదువు పెద్దగా లేదనేది అసలు విమర్శగా మారింది అని కమల్‌ని ప్రశ్నిస్తే, కామరాజ్ నాడార్, శివాజీ గణేషన్, ఎంజీ ఆర్‌లు కూడా పెద్దగా ఉన్నత చదువులు చదుకుకోలేదని, ఇక్కడ ప్రజల మనసు గెలుచుకున్నామా? లేదా? అనేదే అసలు పాయింట్ అంటూ తేల్చేశాడు. మరి జయ, రజినీ అభిమానుల నుంచి కమల్‌కి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో వేచిచూడాల్సివుంది..!