సుకుమార్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా... తన కథలను వేరే డైరెక్టర్ కి ఇవ్వడం కూడా చేస్తుంటాడు. సుకుమార్ నిర్మతగా తెరకెక్కిన 'కుమారి..' అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్ అంటూ 'దర్శకుడు' సినిమా బాధ్యతలను నెత్తినెత్తుకున్నాడు సుకుమార్. ఇక సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ఈ 'దర్శకుడు' మూవీ ప్రమోషన్ ని కొత్తగా చేస్తున్నారు సుకుమార్ అండ్ టీమ్. 'దర్శకుడు' చిత్ర పాటలను ఒక్కొక్కటిగా సుకుమార్ తో వర్క్ చేసిన టాప్ నటీనటులతో విడుదల చేయిస్తూ అందరి చూపు 'దర్శకుడు' సినిమా మీద పడేలా చేశాడు.
మరి చాలా డిఫరెంట్ గా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టిన సుకుమార్ 'దర్శకుడు' ఆడియో కి రామ్ చరణ్ తీసుకొచ్చి చరణ్ చేతుల మీదుగా ఆడియో ని విడుదల చేయించాడు. ఇక తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ని గెస్ట్ గా ఆహ్యానించాడు. ఇక ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మీద ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో 'ఆర్య, ఆర్య 2' సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలకి కలిసి పనిచేసిన అనుబంధంతోనే అల్లు అర్జున్ ఇలా సుకుమార్ గురించి చెప్పుకొచ్చాడు. అసలు సుకుమార్ ఏదన్నా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే ఆ సినిమా నా సినిమా కిందే లెక్క. ఎందుకంటే సుకుమార్ నావాడు కాబట్టి. సుకుమార్ కి నాకు మంచి అనుబంధం ఉందని చెబుతూనే నేను మగవారిలో ఎవరికైనా 'ఐ లవ్ యు' అని చెప్పాల్సి వస్తే అది ఒక్క సుకుమార్ కె చెబుతానంటూ హాస్యమాడాడు.
అలాగే సుకుమార్ తో 'ఆర్య 3' తీస్తారా అని అల్లు అర్జున్ ని ఫాన్స్ ప్రశ్నించగా.... బన్నీ నవ్వుతూ... 'ఆర్య' లో హీరోకి కాస్త తిక్క.... అలాగే 'ఆర్య 2'లో అది మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 'ఆర్య 3' గనక తీయాలి అంటే పిచ్చివాడి మీద సినిమా తీయాలి. సుకుమార్ గనక కథ సిద్ధం చేస్తే నేను నటించడానికి సిద్దమే అంటూ... ఇక 'దర్శకుడు' సినిమా గురించి చెప్పాలంటే.... సినిమాలో పనిచేసే వారందరికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మాత్రం ఒక్క దర్శకుడిదే. దర్శకుడు అనే వాడు సెట్ లో ఎటువంటి ఈగోలు రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేవాడు. అందరిని కలుపుకుపోవాలి.లేకుంటే సినిమా డైరెక్షన్ అస్సలు సాధ్యం కాదు అంటూ హీరో, హీరోయిన్ కి, డైరెక్టర్ హరి ప్రసాద్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు అల్లు అర్జున్.