మాస్.. ఇంకా చెప్పాలంటే ఊరమాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు బోయపాటి శ్రీను. 'సరైనోడు' వంటి మామూలు కంటెంట్‌తో వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక ఆ చిత్రం విజయంలో బన్నీకి ఎంత పాత్ర ఉందో.. బోయపాటికి కూడా అంతే క్రెడిట్ వుంది. ఇక ఆ వెంటనే గీతా ఆర్ట్స్‌లోనే మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 152వ చిత్రానికి అగ్రిమెంట్ చేస్తున్నాడు.కాగా ఆయన ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో 'జయ జానకీ నాయకా' అనే చిత్రం చేస్తున్నాడు.
బయటకు ఇదో ఫ్యామిలీ, యూత్, అండ్ క్లాస్ టచ్ వున్న చిత్రంగా టైటిల్, ఫస్ట్‌లుక్స్ వంటివి ఉన్నా కూడా బోయపాటి అస్త్రాలు దీనిలో కూడా బోలెడు ఉన్నాయంటున్నారు. కానీ హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించే బోయపాటి దెబ్బకు ఈ బెల్లంకొండ చిన్నోడు సరితూగుతాడా? లేదా? అన్నదే డౌట్. అదే అనుమానం బోయపాటికి కూడా వచ్చే ఆయన కాస్త ఫ్యామిలీ రంగు పూస్తున్నాడని, 'రారండోయ్ వేడుక చూద్దాం'లో నటనాపరంగా కూడా మెప్పించిన రకుల్‌ని హైలైట్ చేస్తున్నాడనే అభిప్రాయం ఉంది. ఇక ఈచిత్రం బిజినెస్ విషయంలో బోయపాటి మార్కెట్ బాగానే వర్కౌట్ అయ్యే అవకాశాలే ఉన్నా థియేటర్ల వరకు సినిమాని తీసుకెళ్లే హీరోనే పెద్ద మైనస్‌గా చెబుతున్నారు.
మొత్తానికి నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి వెనుక బెల్లంకొండ సురేష్ అభయహస్తం ఉండటంతో 'అల్లుడు శ్రీను'లాగానే భారీ బడ్జెట్టే పెట్టాడట. కానీ చిత్రం ట్రైలర్ మాత్రం పెద్దగా మెప్పించలేక పోయింది.ఇక చిత్రం 30 కోట్లు బిజినెస్ చేసి, వీలుంటే 40కోట్ల వరకు రావచ్చంటున్నాడు. ఈ హీరోతో 40 లాగడం అంటే అంత చిన్నవిషయం కాదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఈ చిత్రం ఆగష్టు 11న విడుదల కానుంది. ఆ రోజే నితిన్-హనురాఘవపూడిల 'లై' ఉంది. రానా కూడా కంటెంట్ మీద నమ్మకంతో 'నేనే రాజు .. నేనే మంత్రి'తో అదే రోజున వచ్చే అవకాశాలే ఉన్నాయి.
ఇక తమ చిత్రానికి ఏ చిత్రం పోటీ కాదని, తన చిత్రాన్ని చూసే ప్రేక్షకులు ఎవరో తనకు తెలుసునని, వారు ఖచ్చితంగా సినిమా చూస్తారని బోయపాటి నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని శంకించడం కాదు గానీ రాజమౌళి తరహాలో కేవలం ఏ హీరో అయినా పర్లేదు.. సినిమా చూడాలి అనేంతగా బోయపాటికి ఫ్యాన్స్ ఉన్నారా? లేదా? అనేదే డౌట్ కొడుతోంది.