నేటి రోజుల్లో 20కోట్లు ఉంటే 'పెళ్ళి చూపులు' వంటివి రెండుమూడు సినిమాలు నిర్మించవచ్చు. నానితో పాటు కొందరు స్టార్స్ సినిమా బడ్జెట్‌కి ఇది సమానం. కానీ బాహుబలి ద్వారా తెలుగు మార్కెట్ దేశ విదేశాలలో కూడా బాగా పెరగడంతో మన నిర్మాతలు కూడా స్టార్‌ని, డైరెక్టర్‌ని, ఆ సీన్ డిమాండ్ చేసే దాన్ని బట్టి కేవలం 8నిమిషాల సీన్‌కి ఏకంగా 20కోట్లు ఖర్చుపెట్టేశారు. విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా, ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో హరీష్ జైరాజ్ సంగీతం, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న మురుగదాస్ చిత్రం 'స్పైడర్'పై రోజు రోజుకి అంచనాలతో పాటు బడ్జెట్ కూడా విపరీతంగా పెంచేస్తున్నారు నిర్మాతలు, మొదట్లో 90కోట్లు అనుకున్న బడ్జెట్ ఇప్పుడు ఏకంగా 130కోట్ల వరకు అవుతోంది.
దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ చిత్రంలో ఒకే ఒక్క పాట బ్యాలెన్స్ ఉంది. దానిని రొమేనియాలో తీయనున్నారు. మరోవైపు గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉండటం, బాహుబలి తర్వాత తెలుగు చిత్రాలలోని సాంకేతిక విభాగంపై కూడా భారీ అంచనాలు పెరిగిన నేపధ్యంలో ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌కి భారీ బడ్జెట్‌ని కేటాయిస్తున్నారు. మహేష్‌బాబు తొలిసారిగా తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో పాటు మురుగదాస్‌కి కోలీవుడ్‌లో ఉన్నడి మాండ్ రీత్యా కూడా బడ్జెట్ పెంచారు.
అయినా కూడా ఈ చిత్రం ఇప్పటికే ఏకంగా 200కోట్ల వరకు బిజినెస్ చేయడంపై నిర్మాతలు ఎక్కడా రెండో ఆలోచనకే తావివ్వకుండా డైరెక్టర్ ఏది అడిగితే అది నో అనకుండా ఇస్తున్నారు. అన్ని కుదిరితే మహేష్ బాబు తొలి బాలీవుడ్ చిత్రం కూడా ఇదే అయ్యే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాలో విలన్ బారి నుండి ప్రజలను హీరో రక్షించే సీన్ ఒకటి ఉందిట. ఈసీన్ మొత్తం సినిమాకే హైలైట్ కానుంది. దాంతో ఈ 8నిమిషాల సీన్ కోసం నిర్మాతలు ఏకంగా 20కోట్లు ఖర్చుపెట్టారట. మొత్తానికి విడుదలకు ముందే భారీ అంచనాలు రేకెత్తిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుండటం విశేషం.