ఇండియన్ సినిమా హిస్టరీలోనే లోకనాయకుడు కమల్‌హాసన్ ఓ యూనిక్ పర్సన్. కొందరు అతని వ్యక్తిగత జీవితం, ఆయన సృష్టించే వివాదాలను చూసి నటుడుగా ఆయన గ్రేటే గానీ ఆయనలో స్ల్పిట్ పర్సనాలిటీ కూడా ఉందని అంటారు. అన్ని విషయాలలోనూ ఆయన నటనా పరంగా, సినిమా సబ్జెక్ట్‌ల పరంగా, వైవిధ్యమైన పాత్రల పరంగా ఆయన దారి కొత్త తరహా దారిగా భావిస్తారు.ఇక కమల్ నటునిగా సక్సెస్ అయ్యాడు గానీ ఆయన సొంత సినిమాలు అంటే అదేం బ్యాడ్‌లక్కో తెలియదు గానీ అవి ఒకపట్టాన పూర్తికావు.. రిలీజ్‌లు కావు. ఆయన ఎప్పుడో 20ఏళ్ల కిందట మొదలుపెట్టిన 'మరుదనాయగం' ఇప్పటికీ పట్టాలెక్కలేదు. త్వరలో పట్టాలెక్కిస్తానని చెబుతున్నాడు. ఇక 'విశ్వరూపం2' నిర్మాణ బాధ్యతలను ఆస్కార్ రవిచంద్రన్ నుంచి ఆయన తీసుకుని త్వరలో విడుదల అని చెప్పినా దానిపై తదుపరి అప్‌డేట్ ఇప్పటివరకు రాలేదు.
మరోవైపు ఆయన నిర్మాణ దర్శకత్వంలో ఆయన, ఆయన కూతురు శృతిహాసన్, బ్రహ్మానందంలతో మొదలైన 'శభాష్ నాయుడు' కూడా మూలన పడింది. ఇక ఆయన ఎప్పుడో తాను 'కడవుల్ ఇరుక్కాన్' ( దేవుడు ఉన్నాడు) అనే చిత్రం చేయనున్నట్లు ఆయన ఎప్పుడో ప్రకటించాడు. దీనిని తమిళం, హిందీ భాషల్లో రూపొందించదలచి మరో ముఖ్యపాత్రకు సైఫ్ అలీ ఖాన్‌ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ చిత్రం అతీగతి లేదు. మొదట్లో ఈచిత్రం తెలుగులో కూడా రూపొందనుందని, ఓ ముఖ్యపాత్రను రవితేజ చేస్తాడని వార్తలు వచ్చాయి. ఇక తాను 'దశావతారం' తో పాటు కొన్ని చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా సోలో విలన్‌గా మాత్రం పూర్తిస్థాయి పాత్రను కమల్ ఇప్పటివరకు చేయలేదు. ఇక ఈచిత్రంలో ఆయన పూర్తి విలనిజం ఉన్నఓ పూర్తి స్థాయి పాత్రను చేస్తానని చెప్పాడు.
తాజాగా ఈచిత్రం స్క్రిప్ట్‌ను దుమ్ముదులిపి బయటకు తీశాడట. అయితే సైఫ్ అలీ ఖాన్ పాత్రలో మరొకరిని తీసుకోనున్నాడట. ఇక ఈచిత్రం తెలుగులో కూడా రూపొందుతుందా? లేక తమిళ వెర్షన్‌నే తెలుగులో డబ్ చేస్తారా? అనే విషయంపై మాత్రం అప్‌డేట్స్ లేవు. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై తాను కూడా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మించనున్నాడు. మరి ఈచిత్రంపైనైనా పూర్తిగా కసరత్తు చేశాడా? లేక ఇది మరో మలుపా? అనే సస్పెన్స్ అందరిలోనూ ఉంది....!