హాట్ టాపిక్: ఛాంబర్ ఎన్నికల్లో అగ్ర నిర్మాతలు ఔట్?! కారణమేంటి?
అగ్ర నిర్మాతలు రింగై 'ఛాంబర్' ఎన్నికల్లో ఫికర్!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి (ఫిలింఛాంబర్) ఎన్నికలు ఈ ఆదివారం (30జూలై) జరగనున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాలకు చెందిన నిర్మాతలు, పంపిణీదారులు(డిస్ట్రిబ్యూటర్లు), ప్రదర్శనదారులు(ఎగ్జిబిటర్), స్టూడియో సెక్టార్ సభ్యు లు ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. దాదాపు 1400 పైచిలుకు సభ్యులు ఈసారి కూడా ఓటింగ్‌లో పాల్గొననున్నారని తెలుస్తోంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఓ తకరారు స్పష్టంగా కనిపిస్తోందని ఛాంబర్‌లో తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే నిర్మాత సి.కళ్యాణ్ ప్యానెల్ అభ్యర్థుల్ని ప్రకటించింది. ప్రత్యర్థి బలగం వివరాలు అందాయి. ఇదిలా వుంటే ఇన్నాళ్ళు ఒక్కో ఏరియా నుంచి ఒక్కో వ్యక్తిని తమ అధ్యక్షుడిగా ఎన్నికుంటూ ఛాంబర్ వచ్చింది. ఒకసారి ఆంధ్ర నుండి ఒక సారి తెలంగాణ ఒకసారి సీడెడ్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అలాగే ఒకసారి నిర్మాతల నుంచి మరోసారి పంపిణీదారుల నుంచి మరోసారి ప్రదర్శదారుల నుంచి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా మారిందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా విడిపోవడం.. రీసెంటుగా జీఎస్టీ ఎఫెక్ట్ తదితరాలు ఫిలింఛాంబర్ ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నాయని తెలుస్తోంది.
రీజన్ ఏదైనా ఈసారి బిగ్ షాట్స్ ఎవరూ ఎన్నికల్లో నిలబడేందుకు ఆసక్తి కనబరచకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అగ్ర నిర్మాతలైన బూరుగపల్లి శివరామప్రసాద్, కొడాలి వెంకటెశ్వర రావు, స్రవంతి రవికిషోర్, టాగూర్ మధు, సిమ్హ ప్రసాద్, దామోదర్ ప్రసాద్ గొడవలయ్యి విత్ డ్రా చేసుకున్నారు.. అయితే అందుకు కారణమేంటి? అని ఆరాతీస్తే.. థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జీల విషయంలో జరిగిన డిబేట్‌లో ఆసక్తికర విషయాలు హాట్ టాపిక్ అయ్యాయని తెలుస్తోంది. థియేటర్ల మెయింటెనెన్స్‌లో ఛార్జీలు తగ్గాలి అన్న ప్రతిపాదనకు సదరు అగ్ర నిర్మాతలు కం థియేటర్ ఓనర్లు ఎవరూ అంగీకరించలేదుట. అందుకే పోటీ బరినుంచి నామినేషన్ వేయకుండా వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో పెద్ద తలకాయలేవీ లేకుండానే ఈ ఎన్నికల్లో ముందుకు వెళుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే తెలుగు సినిమా భవిష్యత్‌ని నిర్ధేశించే కీలకమైన ఫిలింఛాంబర్ ఎన్నికల్లో దిశానిర్ధేశనం చేసే పెద్దలే తప్పుకోవడం ఎంతవరకూ సమంజసం? అసలేం జరుగుతోంది? అన్న వాడి వేడి చర్చా నిర్మాతల్లో సాగుతోంది.