తాజాగా చార్మి డ్రగ్స్ ఆరోపణల నిమిత్తం సిట్ విచారణకు హాజరై, తన స్క్రిప్ట్ ప్రకారం నో... తెలియదు అని చెప్పి ఐదుగంటలలోపే విచారించాలనే నిబంధన ఉండటంతో బయటికి వస్తూ ఉత్సాహంగా నవ్వి, మీడియాకు కూడా చేతులూపింది. దీనిని టీవీలో చూసిన వర్మ.. చార్మి లోపలకు వెళ్లినప్పటికంటే బయటకు వచ్చేటప్పుడు సంతోషంగా, ధైర్యంగా ఉందని, ఆమెని చూస్తుంటే ఆమే సిట్ వారిని విచారించిందేమో అని పిస్తోందని, ఆమెను అప్పుడు చూస్తే జ్యోతిలక్ష్మిలా కనిపించలేదని, రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్‌లా కనిపించిందని వర్మ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత, అష్టావధాని, శతావధాని జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మండిపడ్డారు.
చరిత్రలోని గొప్ప వ్యక్తులు, దేశభక్తి కలిగిన వారితో పోల్చేటప్పుడు కాస్తైనా ఆలోచన ఉండాలని, చార్మి ఏం చేసిందని ఝాన్సీ లక్ష్మీభాయ్‌తో పోల్చావని ఆయన వర్మపై మండిపడ్డాడు, ఝాన్సీ లక్ష్మీభాయ్ దేశభక్తికి, త్యాగానికి, పోరాటానికి, పరాక్రమానికి, సాహసానికి ప్రతీక. వారితో ఎవరినైనా పోల్చేటప్పుడు సరైన కారణం ఉండాలి. అంతేగానీ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఎలా? ఆయన మాట్లాడింది చాలా పెద్ద విషయం.
ఆ పోలిక సరికాదు. చార్మి.. ఝాన్సీ లక్ష్మీభాయ్ కాదు.. ఆమెను విచారించిన సిట్ అధికారులు ఆంగ్లేయులు కాదు.. ఆమె బయటకు వచ్చేటప్పుడు కూడా నవ్వుతూ ఉండి నీకు నచ్చివుంటే నిబ్బరంగా ఉందనో, లేక మరోలానో పొగుడు. అంతేగానీ ఝాన్సీ లక్ష్మీభాయ్‌తో పోల్చడం సరికాదు. సిట్ మీద కావాలంటే నీ అభిప్రాయం తెలుపుకో. అంతేగానీ అలాంటి వ్యాఖ్యలు తగవు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అని జొన్నవిత్తుల ఫైర్ అయ్యారు.