సూపర్‌స్టార్ రజినీకాంత్ కూతుర్లు హీరోయిన్లు కాకపోయిన దర్శకత్వంతో తమ ప్రతిభ చాటాలని చూస్తున్నారు. 'త్రీ' చిత్రంతో ఐశ్వర్య దెబ్బతింటే, 'కొచ్చాడయాన్'తో సౌందర్చ తెలుగులో 'విక్రమసింహ'గా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఇప్పుడు తన బావ ధనుష్, అమలా పాల్, కాజోల్‌లతో 'విఐపి 2' చేస్తోంది. ఆగష్టు మొదటి వారంలో ఈ చిత్రం విడుదల కానుంది, ఇందులో ధనుష్‌కి ధీటైన పాత్రలో బాలీవుడ్ నిన్నటితరం హీరోయిన్ కాజోల్ పోటాపోటీగా నటించిందని తెలుస్తోంది.
ఇక 'బాబా, లింగా'ల కంటే రజినీతో సౌందర్య తీసిన 'కొచ్చాడయాన్'పెద్ద డిజాస్టర్. రజినీని కేవలం ఆయన నటించినా, నటించకపోయినా తెరపై ఆయన్ను ప్రత్యక్ష్యంగా చూడాలని ఆశపడతారు. కానీ దాదాపు 120కిపైగా కోట్లకు ఖర్చుపెట్టి సౌందర్య రజినీ, దీపికాపడుకొనేలతో మోషన్ పిక్చర్ టెక్నాలజీతో పూర్తిగా పట్టులేకుండా ఓ యానిమేషన్‌వంటి చిత్రం తీయడం చూసి రజినీ అభిమానులు నాడు ఫైర్ అయ్యారు. దీనిపై సౌందర్య తన తప్పుని ఒప్పుకుంది.
పనిలో పనిగా తనకు మరోసారి అవకాశం వస్తే 'కొచ్చాడయాన్'కి రీమేక్ చేస్తానని ప్రకటించడంతో అందరికీ గుండెలు ఆగినంత పనైంది. ఇక ఆమెకు తెలుగులో కూడా డైరెక్షన్ చేయాలని ఉందట. తనకిష్టమైన మెగాస్టార్ డేట్స్ దొరికితే, అందుకు తగ్గ కథ లభిస్తే మాత్రం తాను చిరుని డైరెక్ట్ చేయాలని ఆశపడుతోంది. అక్కడ రజినీకి ఆమె కూతురు కాబట్టి అవకాశం వచ్చింది. మరి చిరు ఆమెలోని ఏ ప్రతిభ చూసి అవకాశం ఇస్తాడు చెప్పండి...!