అల్లు వారి చిన్న అబ్బాయ్ అల్లు శిరీష్ హీరోగా ఎంటరై ఏళ్లు గడుస్తున్నా సరైన బ్రేక్ ఇప్పటి వరకు రాలేదు. ఏదో 'శ్రీరస్తు..శుభమస్తు' చిత్రం ఓకే అనిపించింది. ఇక ప్రస్తుతం ఆయన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' ఫేమ్ వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయనకు జోడీగా సురభి, సీరత్ కపూర్‌లు నటిస్తున్నారు. విఐ ఆనంద్ దర్శకుడు కావడంతో ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.
షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. కేవలం అవార్డు వేడుకలకు హోస్ట్‌గా తప్ప నటనాపరంగా ఇప్పటి వరకు తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయిన అల్లు శిరీష్ ఈ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కి, విఎఫ్‌ఎక్స్‌లకు కూడా పని ఉండటంతో చిన్నగా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో రావాలని భావిస్తున్నారట. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ చర్చనీయాంశం అయింది.
ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే సన్ నెట్ వర్క్ వారు శాటిలైట్ హక్కులను ఏకంగా 4.5కోట్లకు తీసుకున్నారని సమాచారం. ఇదే నిజమైతే శిరీష్ కెరీర్‌లో ఇదే బెస్ట్ అని చెప్పాలి. దర్శకుడు విఐ ఆనంద్‌పై ఉన్ననమ్మంతో పాటు అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ఆ రేటుకు తీసుకుంటేనే తాను చిరంజీవితో చేయబోయే 152వ చిత్రం, బన్నీ నటిస్తున్న 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' సినిమాలను సన్ నెట్ వర్క్‌కి ఇప్పిస్తానని వాగ్దానం చేయడంతోనే ఈ చిత్రం శాటిలైట్ ఇంత తొందరగా, అందునా సన్ నెట్ వర్క్ ఆ రేటుకు ఓకే చెప్పిందని సమాచారం. మొత్తానికి మాస్టర్ బ్రెయిన్‌ని ఎప్పుడు? ఎక్కడ? ఎలా వాడాలో అరవింద్‌కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదనే చెప్పాలి.