మొన్నటి అంజలీదేవి, భానుమతి, సావిత్రి, జమున, శ్రీదేవి, జయప్రద, జయసుధ, భానుప్రియ, విజయశాంతి, సౌందర్యల తర్వాత మరలా అటువంటి నటీమణులు దొరుకుతారా? నటన కంటే గ్లామర్‌నే నమ్ముకుని, మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్న ఉత్తరాది భామలతో ఎంత కాలం గడపాలి? అని విసిగివేశారుతున్న తెలుగు సినిమా నిజమైన ప్రియులకు నేడు వస్తున్న కీర్తి సురేష్, నివేధా థామస్, సాయి పల్లవి, అను ఇమ్మాన్యుయేల్‌లతో కాస్త ఊరట లభిస్తోంది.
పరభాషా నటీమణులే అయినప్పటికీ వీరు చూపుతున్న నటన, ఎక్స్‌పోజింగ్‌ని నమ్ముకోకుండా కేవలం నటనాప్రతిభనే నమ్ముకోవడం, స్టార్‌హీరోల చిత్రాలైనా సరే, మణిరత్నం, గౌతమ్ మీనన్ వంటి వారికి కూడా గ్లామర్ అంటే నిస్సంకోచంగా నో చెబుతున్న తీరు చూస్తే మరలా మన సినిమాలకు హీరోయిన్లను చూసి కూడా వెళ్లవచ్చు అనే నమ్మకం కలుగుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో పాతుకుపోయామనే భ్రమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా వంటి వారికి వీరు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. మణిరత్నం 'చెలియా'తో పాటు గౌతమ్ మీనన్ 'ధృవ నక్షత్రం'కి కూడా సాయి పల్లవి నో చెప్పినప్పుడు హీరోయిన్లను ఎంతో అందంగా చూపించే లెజెండ్స్‌నే కాదన్నదని సాయి పల్లవిపై విమర్శలు వచ్చాయి.
ఇక 'నేను.. శైలజ', 'నేను..లోకల్'లో నటనాతో ఆకట్టుకుని విజయ్, పవన్ కళ్యాణ్ వంటి హీరోల చిత్రాలలో కూడా ఎక్స్‌పోజింగ్‌కి నో చెప్పిందని కీర్తి సురేష్‌ని చూసి చాలా మంది విస్తుపోయారు. ఇక 'జెంటిల్ మేన్, నిన్నుకోరి'లతో పాటు ఎన్టీఆర్ 'జై లవ కుశ' కూడా హిట్టయితే నివేదా థామస్ దశ తిరిగినట్లే. ఇక భాషలకతీతంంగా 'ప్రేమమ్'లో తన నటనతో అలరించి, 'ఫిదా'లో భానుమతిగా ఎంతో కష్టతరమైన తెలంగాణ యాసను కూడా ఓన్‌గా డబ్బింగ్ చెప్పిన సాయి పల్లవిని చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
ఇక ఆమె 'ఎంసీఏ'కూడా విడుదలైతే ఇక చెప్పనవసరం లేదు. మొహంపై మొటిమలు, చెరగని చిరునవ్వు, పక్కింటి అమ్మాయిలా సాయి పల్లవి నటన చూస్తే వావ్ అనిపిస్తోంది. మొత్తానికి రాబోయే టాలీవుడ్ ఆశలన్నీ కీర్తి సురేష్, సాయి పల్లవి, నివేదా థామస్, అనుపమపరమేశ్వరన్, అను ఇమ్మాన్యుయేల్, లావణ్య త్రిపాఠిల చుట్టే తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.