మనదేశంలో ఉన్న దరిద్య్రం ఏమిటంటే, ఏమీ చేయకుండా చూస్తూ ఉంటే... ఏం చేస్తున్నారు? వినోదం చూస్తారా? మీ పనిని సరిగ్గా నిర్వర్తించరా? అని ప్రశ్నిస్తారు. అదే ఓ అధికారి నిజాయితీగా పనిచేస్తుంటే, పబ్లిసిటీ కోసం చేస్తున్నావా? మేమే దొరికామా? మేమైతేనే మైలేజ్ వస్తుందని భావించావా? దేశ ప్రధానిని కూడా ప్రశ్నించగల ధైర్యం ఉందా? అంటూ ఆ అధికారిని నిత్తేజుడ్ని చేసి, ఛ.. నాకెందుకు పట్టిన గొడవరా?. అందరూ చూసిచూడనట్లుగానే నేను కూడా చూసిచూడనట్లుగా ఉంటే బాగుండేది కదా?? అనే స్థాయికి తీసుకొస్తారు. సినిమాలలో మంచిని చూపిస్తే మంచి వారైపోతారా? ఎన్ని వెధవ పనులు చీకట్లో చేసినా, ఒక అభ్యుదయ చిత్రాన్నో, లేక రచననో చేసినంత మాత్రాన సంఘ వ్యతిరేకులు కాకుండా పోతారా?
ఇప్పుడు టాలీవుడ్‌ని పట్టిపీడిస్తూ, అలజడి రేపుతోన్న డ్రగ్స్ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి అయిన అకున్ సబర్వాల్ ని అందరూ అలాగే ఆడిపోసుకుంటున్నారు. దేశంలోని అందరినీ ఒకేసారి మార్చడం, పట్టుకోవడం వీలుకాని పని, రాజకీయనాయకులను అడిగితే సినిమా వారికంటే మేమేం తప్పు చేస్తున్నాం. అక్కడ వ్యభిచారం, డ్రగ్స్, మాఫియా, డాన్‌ల పెత్తనం సాగడం లేదా? వారిని వదిలేసి మమ్మల్ని టార్గెట్ చేస్తారా? అంటారు. సినిమాలలో పోలీసులను, అధికారులను, మీడియాను ఎంతో ఉన్నతంగా చూపించే వారే... వారు తమనే టార్గెట్ చేయడం సహించలేకపోతారు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. సినిమా వారిని పట్టుకుంటే బడా బాబులు ఏమయ్యారు? అంటారు. రాజకీయనాయకులను ఎందుకు టార్గెట్ చేయరు? అంటారు. వారిని పట్టుకుంటే వీరి మీద, వీరిని పట్టుకుంటే వారి మీద నిందలు వేస్తారు.
అంటే దేశంలో నిజాయితీగా పనిచేసే వారిని కూడా తమ విధులను చేయకుండా అడ్డుపడటం కిందకే ఇది వస్తుంది. ఇక ఈ కేసులో ఉన్న పత్రికాధిపతిని, జర్నలిస్ట్‌ల పేర్లను కూడా బయటపెట్టాలి. లేదంటే అందరు జర్నలిస్ట్‌లు అలాంటి వారే అనే ప్రచారం జరుగుతుంది. ఇక హైదరాబాద్‌లో కదలిన కెల్విన్ ముఠా డ్రగ్స్ డొంక ఏకంగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ ఆఫ్రికన్, నైజరియన్ వంటి ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా వరకు వెళ్లింది. తాజాగా ఓ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ కాల్ అకుల్‌ని బెదిరిస్తూ, నువ్వెక్కడ ఉంటావో, నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో? అన్నీ మాకు తెలుసు. ఇంక దూకుడు తగ్గించు.. లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఓ బెదిరింపు కాల్ రావడం నిజంగా సంచలనమే.
దీంతో హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు, ఏకంగా ఇంటర్నేషల్ మాఫియాతో లింకులు ఉన్నాయని తెలిసిపోతోంది. అందరూ భావిస్తున్నట్లు ఇదేదో చిన్నచితకా సంఘటన, ఏదో పబ్లిసిటీ కోసం సినిమా వారిని టార్గెట్ చేసినట్లుగా భావించకూడదు. సబర్వాల్ వల్ల డ్రగ్స్ సరఫరా కాస్త తగ్గిపోవడం, దానిని అమ్మేవారు, వినియోగించేవారు కాస్త దానికి బ్రేక్‌లు వేయడంలో ఒక్క హైదరాబాద్ వల్లనే ఇంటర్నేషనల్ మాఫియాకు ఏకంగా రోజుకు కోట్ల నష్టం వస్తోందంటే ఇది మాత్రం అతి చిన్న నేరం కానేకాదు. దీని వెనుక ఎన్నో హస్తాలున్నాయి. సబర్వాల్ వంటి వారికి స్వేచ్చనిస్తే గానీ పెద్దల గుట్టు కూడా రట్టుకాకతప్పదు.