ఈ మధ్యకాలంలో అల్లుఅర్జున్ అలియాస్ బన్నీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. ఎప్పుడైతే 'చెప్పను బ్రదర్' అని ఎమోషన్ కొద్ది అనేశాడో.. నాటినుంచే ఆయన ఏమి చేసినా, ఆయన ఏమి మాట్లాడినా, చివరకు తన ప్రమేయమే లేకపోయినా ఆయన చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి. 'డిజె' రిజల్ట్‌పై రచ్చ, ఈ సినిమా కలెక్షన్లను చిరు 'ఖైదీ నెంబర్ 150' కంటే ఎక్కువ చేసి చెప్పడం, దీనిపై మెగాభిమానులు దిల్‌రాజు ఆఫీసును ముట్టడించడం, సోషల్‌మీడియాలో వచ్చిన నెగటివ్ కామెంట్స్, పైరసీ, రివ్యూల నుంచి డిజ్‌లైక్స్ వరకు అన్ని వివాదాలే.
ఇక ఎక్కడో జగపతిబాబు.. బన్నీని మెచ్చుకుంటే దానిపై కూడా దుమారం రేగింది. నేను చిరంజీవిని గుర్తు చేస్తానే గానీ అనుకరించను అనడంతో.. అంటే రామ్‌చరన్ అనుకరిస్తున్నాడనా? అని కూడా వివాదాలు వచ్చాయి. ఇప్పుడు బన్నీ తనకు ప్రమేయం లేకుండానే మరో వివాదంలో ఇరుక్కుని కమల్‌హాసన్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన ఆగ్రహాన్ని, నెగటివ్ కామెంట్స్‌కి గురవుతున్నాడు. విషయానికి వస్తే బన్నీ, చరణ్‌లు ప్రోకబడ్డీలో 'తమిళ తలైవాస్' టీంను కొనుక్కున్నారు. తాజాగా ఈ జట్టుకు లెజెండరీ నటుడు కమల్‌హాసన్‌ని అంబాసిడర్‌గా పెట్టుకున్నారు. తమిళ తలైవాస్ జట్టును పరిచయం చేయడానికి బన్నీ, చరణ్, కమల్‌లు కలసి విలేరుల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కమల్, చరణ్ లు ఒద్దికగా కూర్చొగా, బన్నీ మాత్రం కాలుపై కాలువేసుకుని కూర్చున్నాడు. దాంతో కమల్ అభిమానులకు ఆగ్రహం వచ్చింది. బన్నీకి పెద్దలను గౌరవించడం, మర్యాదగా నడుచుకోవడం తెలియవా? లెజెండరీ నటుడే ఒద్దికగా కూర్చుంటే బన్నీ మాత్రం ఆ దిగ్గజ నటుడి ముందు కాలుపై కాలు వేసుకుని తమ హీరోని అవమానిస్తాడా? అని బన్నీని లోకనాయకుడు ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. అసలు ఈ విషయం ఇంత వివాదం అవుతుందని కమల్‌గానీ, బన్నీ గానీ ఊహించి ఉండరు. మరి ఇంత సిల్లీ విషయానికి కూడా వివాదం రేపడం ఏమిటి? ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచేయాలని బన్నీ అభిమానులు భావిస్తున్నారు.