ఒక పక్క పాశ్చాత్య పోకడలతో సాగే 'బిగ్‌బాస్' తమిళ సంప్రదాయాలను, సంస్కృతిని నాశనం చేస్తోందని కమల్ హోస్ట్ చేస్తున్న తమిళ 'బిగ్‌బాస్' తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్‌బాస్' షోపై కామెంట్లు, సెటైర్లు ఎక్కువయ్యాయి. ఇక తాజాగా ఇందులో ఇచ్చిన ఓ టాస్క్ హిందూ సంప్రదాయాలను కించపరిచే విధంగా ఉందని బ్రాహ్మణసంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ షో లోని ఓ టాస్క్‌లో కొంత సమయం ఇచ్చి తమకు వీలైనన్ని బట్టలను తీసుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.
కానీ సంపు కావాల్సినన్ని బట్టలను తీసుకోవడంలో విఫలమై పంచె, ధోతితో టవల్ కప్పుకుని అర్దనగ్నంగా కనిపిస్తున్నాడు. ఇక ఎవరి గుడ్డలు వారికి కావాలంటే హౌస్ ఆవరణలో ఓ హోమగుండాన్ని ఏర్పాటు చేసి దానిలో మంట ఆరిపోకుండా చూసుకుంటే ఒక్కొక్కరి బట్టలు మరలా ఇస్తామని బిగ్‌బాస్ ఆదేశించాడు. దాంతో హిందువులు పవిత్రంగా భావించే హోమగుండం వెలిగించారు. కానీ ఇందులో పాల్గొంటున్న పార్టిసిపెంట్స్ ఈ హోమగుండం వద్ద బ్రష్ చేస్తూ, చెప్పులేసుకుని తిరుగుతూ, చలిమంటలలాగా చలికాచుకోవడం పట్ల హిందు సంస్థలు, బ్రాహ్మణ, పౌరోహిత్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఏదో మంట వేసుకోండి... ఆరిపోకుండా చూసుకోండి అని టాస్క్ ఇవ్వకుండా, అదో పనిగా హోమగుండం పేరును కావాలని వివాదాల కోసమే వాడారని, టీఆర్పీలు పెంచుకోవడానికే కావాలని ఇలాంటి వివాదాలను షో నిర్వాహకులు చేస్తున్నారని, దీనిపై హిందువులను సమైక్య పరిచి, న్యాయపరంగానైనా ఇలాంటి చీప్ ట్రిక్స్‌ని అడ్డుకుంటామని పలు హైందవ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదం చినికిచినికి గాలివానలా మారి మరెన్ని వివాదాలకు కారణమవుతుందో వేచిచూడాల్సివుంది....!