తెలుగు దర్శకులలో క్రియేటివ్ దర్శకునిగా కృష్ణవంశీకి మంచి పేరుంది. ఆల్‌రెడీ తెలుగులో మరో క్రియేటర్ పెద్ద వంశీ ఉండటంతో ఈయనను అందరూ ముద్దుగా చిన్నవంశీ అని పిలుస్తుంటారు. తెలుగుతనం ఉట్టిపడేలా బంధాలు, అనుబంధాలను చూపుతూ, తెర నిండా నటీనటులతో కనువిందు చేయాలన్నా మరీ ముఖ్యంగా తెలుగింట జరిగే పెళ్లి సీన్లను తీయాలన్నా ఈయనకు మరోకరు సాటిరారు. ఇక హీరోయిన్లను అందంగా చూపించడంలో, పాటలను ఎంతో బాగా తీయడంలో కె.రాఘవేంద్రారావు, పెద్ద వంశీల తర్వాత కృష్ణవంశీనే చెప్పుకోవాలి.
ఇక సమాజంలో జరిగే వాస్తవ సంఘటలను, సమాజంలోని పలు వైపరీత్యాలను తీయడంలో కూడా ఈయన సిద్దహస్తుడు. 'గులాబీ, నిన్నేపెళ్లాడతా, ఖడ్గం, మురారి, సముద్రం, అంత:పురం' నుంచి 'రాఖీ, మహాత్మా, చందమామ' వరకు మంచి చిత్రాలను తీశాడు. కానీ మద్యలో గాడితప్పి, ఫామ్ కోల్పోయాడు. 'శశిరేఖాపరిణయం, మొగుడు' వంటి చిత్రాలు ఆయన తీసినవేనా? అనేంతగా అనుమానం రేకెత్తించాయి. ఇక రామ్‌చరణ్‌తో 'గోవిందుడు అందరివాడేలే' వంటి మంచి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక ఆయన ముందుగా స్క్రిప్ట్‌లను, సీన్లను ప్రిపేర్ అయి రాడని, షూటింగ్ స్పాట్‌కి వచ్చిన తర్వాత తాను తోచింది తీస్తాడని, రీళ్లకు రీళ్లు, నెలలకు నెలలు సినిమా తీస్తూ ఒక చిత్రాన్ని రెండు సినిమాల నిడివితో తీసి, తర్వాత వేస్టేజ్‌ని తీసేసి, నిర్మాతలపై ఆర్థికభారం మోపుతాడని, అదే ఆయన అనుకున్న బడ్జెట్‌లో తీస్తే ఆయన ఎప్పుడూ బిజీగా ఉండేవాడని కూడా అంటారు.
ఇక సినిమా షూటింగ్‌లో రాజీపడడని, తనకు నచ్చిన అవుట్‌పుట్ వచ్చే వరకు తీస్తూనే ఉంటాడని, రిహాల్సర్స్‌పై దృష్టి కేంద్రీకరించడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా ఆయన తీసిన 'నక్షత్రం' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ, ఒక హీరోకు జ్ఞాపకశక్తి తక్కువ. రెండులైన్ల డైలాగును కూడా చెప్పలేడు. నేను వర్క్ విషయంలో కాంప్రమైజ్‌కాను. దాంతో బయటికి వెళ్లిన తర్వాత నా గురించి చెడ్డగా చెప్పుకుంటారని నాకు కూడా తెలుసు. కానీ ఎక్కువమంది కృష్ణవంశీతో పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నామని చెప్పేవారే ఎక్కువ. దాంతో నాపై విమర్శలు చేసేవారిని నేను పట్టించుకోను.
ఇక 'నక్షత్రం' ఆలస్యం కావడానికి ఇందులో ఎంతో మంది నటీనటులు నటిస్తుండటంతో పాటు నోట్ల రద్దు కూడా ఒక కారణం. 'రైతు' చేయడానికి బాలయ్య రెడీగా ఉన్నాడు. కానీ అందులో ఓ కీలకపాత్రను అమితాబ్‌బచ్చన్ ఒప్పుకుంటేనే అది పట్టాలెక్కుతుంది. ఇక నేను అనుకున్న స్థాయిలో నన్ను నమ్మిన రామ్‌చరణ్‌కి విజయం అందించలేకపోయాను. మరో అవకాశం వస్తే కెరీర్‌లో ఆయన కలకాలం గుర్తుంచుకునే చిత్రాన్ని అందిస్తానని అంటున్నాడు. ఆల్ ది బెస్ట్ టు చిన్న వంశీ...!