గత కొన్ని రోజులుగా మీడియాకి పూరి జగన్నాధ్ టార్గెట్ అవుతూనే ఉన్నారు. డ్రగ్స్ స్కాండిల్ కేసులో ఇప్పటికే విచారణకు హాజరైన పూరి..అనంతరం ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మీడియా తన కుటుంబాన్ని రోడ్డుకు లాగిందని, తమ కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లుగా కథనాలు తయారుచేసి, మా జీవితాల్ని నాశనం చేసిందని ఆ వీడియోలో పొందుపరిచాడు. పూరి సంగతి ఇలా ఉంటే, పూరి జగన్నాధ్ అభిమానిని అంటూ ఒకతను వాయిస్ ఓవర్ ఇస్తూ..మరో వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో పూరి గురించి, తన అభిమానం గురించి చాటుకున్నా.. చాలా రాంగ్‌గా పూరిని ప్రజంట్ చేశాడు.
ఇదిలా ఉంటే..తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' గురించి అప్‌డేట్ ఇస్తూ.. 'ఐ లవ్ ఇండియా..ఐ హేట్ ఇండియన్స్' అనేది ట్యాగ్‌లైన్‌గా పూరి చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం అర్ధం కావటం లేదు. 'ఇండియాని ప్రేమిస్తా..కానీ భారతీయులను ధ్వేషిస్తా..' నని చెప్పడం ఏమిటో అర్ధం కావడం లేదు. భారతీయులంతా కలిస్తేనే ఇండియా అనేది పూరీకి తెలియదా..! అయినా తనేదో ఉత్తముడు, తనొక్కడే భారతీయుడు అన్నట్లుగా..చెప్పడం చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. పూరీ హేట్ చేసే.. భారతీయులు తను తీసిన సినిమా చూడకపోతే..పూరీ పరిస్థితేంటి? ఏ.. నిర్మాత, పూరీతో సినిమా తీయడానికి ముందుకు రాకపోతే పూరీ గతేంటి? ఎందుకంటే నిర్మాతలు కూడా భారతీయులే కదా..!
సరే! డ్రగ్స్ విషయంలో మీడియా నాపై అత్యంత దారుణంగా ప్రవర్తించిందని, పూరీ, పూరీ అభిమాని గగ్గోలు పెడుతున్నారు. పూరీ గొప్ప దర్శకుడు. కాదని అనలేం. అలాంటి గొప్ప దర్శకుడి పేరు అసలు ఈ లిస్ట్‌లో వచ్చిందంటే.. అతను తప్పు చేయబట్టే కదా..! ఏ రాజమౌళి పేరో, వినాయక్ పేరో ఎందుకు రాలేదు? అలాగే పూరీపై విచారణ కూడా సుమారు 11 గంటల పాటు జరిగిందంటే.. పూరీ ఏం తప్పు చేయలేదని భావించాలా..? నేను గొప్పోడ్ని.. ఓ స్టార్ హీరోని, హీరోయిన్‌ని, ఇంకా 150 మంది ఆర్టిస్ట్‌లని డీల్ చేస్తున్నానని దర్శకుడుగా పూరి పొంగిపోవడంలో తప్పులేదు కానీ.. నేను డ్రగ్స్ తీసుకుంటున్నాను..ఇంకో 150 మందికి డ్రగ్స్ అలవాటు చేస్తాను అంటే.. భావితరం భవిష్యత్తు ఏమయిపోతుందో పూరీనే చెప్పాలి.
సినిమాల్లో కనిపించే హీరోని ఆరాధించినా.. తమ హీరోని అంత గొప్పగా చూపించే దర్శకుడు.. ముఖ్యంగా పూరీ లాంటి వాళ్ళని కనిపించకుండా ఆరాధిస్తుంటారు అందరి హీరోల అభిమానులు. అలాంటి పూరి ఇచ్చే సందేశం ఏమిటి? ఆయన బాషలో చెప్పాలంటే 'భారతీయుల్ని సంకనాకి పొమ్మనా..లేక భారతదేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా పొమ్మనా..'? అందుకే చెప్పేది..ఆయన హేట్ చేయడం కాదు..భారతీయుల్ని, భారతదేశాన్ని హేట్ చేసే వాళ్లెవరైనా.. పాకిస్తాన్ అయినా, చైనా అయినా, ఆఖరికి పూరీ అయినా.. మనం ధ్వేషించాల్సిందే. తిరిగి పోరాటం చేయాల్సిందే.