వాస్తవానికి నందమూరి హీరోలు పెద్దగా రీమేక్‌లు చేయరు. అలనాటి స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి బాలయ్య వరకు అరా కొరా చేశారే గానీ వాటికంటే ఎక్కువగా స్ట్రెయిట్ కథలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. గతంలో బాలయ్య 'లక్ష్మీ నరసింహ' తర్వాత రీమేక్‌ల జోలికి పోలేదు ఇక జూనియర్ ఎన్టీఆర్ రూటు కూడా అదే. ఆయన కూడా పెద్దగా రీమేక్స్‌పై ఆసక్తి చూపడు. కానీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ యంగ్‌టైగర్‌పై ఇండస్ట్రీలో వినపడుతోంది.
తాజాగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన 'రాజ కుమార' చిత్రం ఇటీవలే కన్నడలో విడుదలై అత్యధిక సెంటర్లలో శతదినోత్సవం సాధించడమే కాకుండా, రికార్డు కలెక్షన్లను సాధించింది. ఇక పునీత్ ఈ చిత్రం శతదినోత్సవంను తన స్నేహితుడైన జూనియర్ ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి సెలబ్రేట్ చేసుకోవడమే కాదు.. ఆ సినిమాను ఓ సారి చూడమని, ఈ చిత్రం కథ తెలుగులో నీకే కరెక్ట్‌గా సెట్ అవుతుందని కూడా చెప్పాడట. ఇక ఈ చిత్రం స్టోరీ విన్న ఎన్టీఆర్ ఎంతో ఎగ్జైట్ అయ్యాడని, కాస్త మార్పులు చేర్పులు చేస్తే ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ఎన్టీఆర్ సైతం కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అంటున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆప్తమిత్రుడు.
గతంలో ఆయన నటించిన 'చక్రవ్యూహ'కి ఎన్టీఆర్, కాజల్‌లు తమన్ సంగీతంలో పాటలు కూడా పాడి ఆ చిత్రం విజయంలో కీలక పాత్రను పోషించారు. ఇక నందమూరి ఫ్యామిలీ అంతటికీ రాజ్‌కుమార్ ఫ్యామిలీతో ఎంతో సత్సంబంధాలున్నాయి. బాలకృష్ణ 100వ ప్రతిష్టాత్మక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో రాజ్‌కుమార్ అతిధి పాత్రలో తళుక్కుమన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న 'జై లవ కుశ' పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌తో అయితే ఓకే.. త్రివిక్రమ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తే మాత్రం 'రాజకుమార'ను రీమేక్ చేసే విషయాన్ని కొట్టి పారేయలేమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.