ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశవ్యాప్తంగా అన్ని మీడియాలలో, జాతీయ పత్రికల్లో కూడా అకున్ సబర్వాల్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన సినీ ప్రముఖుల ఇంటరాగేషన్‌లో, సిట్ దర్యాప్తు విషయంలో చూపిస్తున్న వైఖరిని చూస్తే ఇంతటి నిజాయితీ ఉన్నవారు ఇంకా ఉన్నారా? అనే అనుమానం రాకమానదు టిఎన్‌శేషన్, అన్నాహజారే, కిరణ్‌బేడీ, జెడీ లక్ష్మీనారాయణ్‌ల సరసన ఈయన చేరి పోవడం ఖాయం.
ఏ సినీ ప్రముఖుడు విచారణకు హాజరైనా కూడా ఆయన వారిని విచారించే అధికారులను ఒకరికి తెలియకుండా మరొకరిని, చివరి నిమిషం వరకు ఏ ప్రముఖుడిని ఏ అధికారులు ప్రశ్నిస్తారో కూడా తెలియకుండా, చివరి క్షణంలో ఫలానా అధికారులే విచారణ చేయాలని అప్పటికప్పుడు అధికారులను నియమిస్తున్నాడు. ముందుగా ఎవరిని ఎవరు విచారిస్తారో తెలిస్తే, ముందుగా ప్రలోభాలకు గురవుతారనేది ఆయన ఉద్దేశ్యం. ఇది నిజం కూడా, ఎవరు ఎవరిని విచారిస్తారో తెలియని విధంగా అధికారులను బృందాలు బృందాలుగా కేటాయిస్తున్నాడు.
అందునా ఈ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు డబ్బు, పలుకుబడి ఉన్నవారు కావడంతో అగర్వాల్ ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇక పూరీ విచారణ సమయంలో మేము గోవా వెళితే తప్పు. మరి మిగిలిన రాజకీయ నాయకులు, ఓ పత్రికాధిపతి వెళ్తే తప్పులేదా? అని ఆ పత్రికాధిపతిని కూడా ఓపెన్ చేసేశాడు. ఇంతకీ ఆ పత్రికాధిపతి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. వారితో పాటు పలు మీడియా సంస్థల్లో పనిచేసే 15మంది విలేకరులకు కూడా ఇందులో పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయి.
ఆ పత్రికాధిపతితో పాటు ఆ 15 మంది జర్నలిస్ట్‌ల జాబితాను కూడా పూరీనే బయటపెట్టాడట. మరి చట్టం ఎవరికైనా చట్టమే కాబట్టి ఆ పత్రికాధిపతి, జర్నలిస్ట్‌ల పేర్లను కూడా బయటపెట్టాలి. కేవలం సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, బడా వ్యక్తులు, వారి పిల్లల పేర్లను కూడా బహిరంగ పరిచి తమ నిబద్దతను అధికారులు, తెలంగాణ ప్రభుత్వం చాటుకోవాల్సిన అవసరం ఉంది...!