డ్రగ్ కేసులో నోటీసులు అందుకున్న పూరి జగన్నాధ్ ఈ రోజు (19 జూలై) న సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. పైసా వసూల్ షూటింగ్ లో బిజీగా వున్నా.. పూరి ఇప్పుడు హైదరాబాద్ లో సిట్ కార్యాలయానికి హాజరయ్యాడు. సిట్ కార్యాలయంలోని ఐదో అంతస్థులో పూరీ విచారణ జరుగుతోంది. పూరి ని సిట్ అధికారులు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి విచారిస్తూ మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చి మళ్లీ విచారణ కోరారు. అయితే పూరీని సిట్ అధికారులు డ్రగ్స్ కేసులో ఎటువంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసుంటారో, ఆ ప్రశ్నలకు పూరి ఎలాంటి సమాధానాలు ఇచ్చివుంటాడో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.
ఇకపోతే ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలోని సిట్ బృందం పూరీపై ప్రశ్నల వర్షం కురిపిస్తుందని తెలుస్తుంది. సిట్ అడిగిన ప్రశ్నలకు పూరీ సమాధానం చెబుతూ తనకు డ్రగ్స్ అలవాటే లేదని స్పష్టం చేశారు. ఓ ఈవెంట్ సందర్భంగా పబ్‌లో కెల్విన్‌ను కలిశానని, తనకు కెల్విన్‌కు మధ్య రెగ్యులర్‌గా ఎలాంటి సంభాషణలు జరగడం లేదని పూరి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే తన సినిమాల్లో చాలా భాగం పబ్స్ లో చిత్రీకరిస్తానని... అందుకే పబ్ ఈవెంట్ మేనేజర్ల తో ఎక్కువ సంబంధాలు ఉన్నాయిగాని, డ్రగ్ డీలర్స్ తో ఎటువంటి సంబంధాలు లేవని చెప్పినట్టు తెలుస్తుంది.
ఇక సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఎటువంటి తడబాటు లేకుండా పూరీ సమాధానం ఇస్తున్నట్టు చెబుతున్నారు. అన్ని ప్రశ్నలకు ఆచి తూచి సమాధానం చెబుతున్న పూరి.. అసలు డ్రగ్స్ కేసులో తన పేరు ఎవరు బయట పెట్టారు అని అధికారులనే పూరి ఎదురు ప్రశ్నించినట్టు చెబుతున్నారు. దీంతో షాక్ అయ్యారంట సిట్ అధికారులు.