ఏరంగంలో ఉన్నవారు ఇతర రంగాలకంటే తమదే అని చెబుతుంటారు. వాదిస్తుంటారు. స్టేజీపై నాటకాలు వేసే వారు తమకు మద్యలో బ్రేక్‌లుండవని, స్వయంగా పాడుతూ, పెద్ద పెద్ద డైలాగ్‌లను కూడా గుర్తుపెట్టుకుని చెప్పాల్సి వుంటుందంటారు. ఇక సినిమా వారైతే మీకు ప్రామర్ట్స్ ఉంటారు. కానీ మాకు అది కాదు. ఒకరోజు కామెడీ సీన్ చేసి, మరలా సినిమాలో ఎక్కడో ఉండే ట్రాజెడీ సీన్‌ని వెంటవెంటనే చేయాల్సి వస్తుందని వాదిస్తారు.
ఇక సినిమా డైరెక్షన్ కంటే యాడ్‌మేకింగ్ కష్టమని కొందరు అంటే.. కాదు కాదు.. సినిమాలు రెండున్నర మూడు గంటలపాటు ప్రేక్షకులను కూర్చోబెట్టడం కష్టమంటారు. ఇక టీవీ సీరియల్స్ తీసే వారైతే సినిమాకు కేవలం ఒకే ఇంటర్వెల్ బ్యాంగ్, ఒకే క్లైమాక్స్‌లు ఉంటాయని, కానీ వేల ఎపిసోడ్స్‌లో సాగే సీరియళ్లలో రోజుకు రెండుమూడు ఇంటర్వెల్‌లు, రోజుకో క్లైమాక్స్ ఉంటుందని వాదిస్తారు. ఇక విషయానికి వస్తే సినిమాలో రెండున్నర మూడుగంటల్లో చెప్పేదాన్ని యాడ్ డైరెక్టర్స్ కేవలం కొన్ని సెకన్లలోనే ఆ ఫీల్ చూపించి, ఆ బ్రాండ్‌ని ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండేలా చేయాల్సి వస్తుంది.
ఇక నాడు, నేడు యాడ్ ఫిలింమేకర్ అయిన శేఖర్ సూరి తన మొదటి చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిలింస్‌లో నాడు ఓ ఊపులో ఉన్న తరుణ్‌తో 'అదృష్టం'ద్వారా దర్శకునిగా పరిచయమయ్యాడు. కానీ ఈ చిత్రం ఆడలేదు. అదే సమయంలో కాస్త గ్యాప్ తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో 'ఎ ఫిలిం బై అరవింద్'తో తన సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత వచ్చిన 'త్రీ, అరవింద్2'లు ఆడలేదు. ఇక తాజాగా 'డాక్టర్ చక్రవర్తి' తీశాడు. ఈ చిత్రం అసలు విడుదలైందో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు.
కానీ ఆయన మాత్రం బాగా రెస్పాన్స్ వస్తోందంటున్నాడు. ఇక తాను సీనియర్ హీరో సంజయ్ దత్ కుమారుడిని హీరోగా పరిచయం చేయడం కోసం ఓ అద్భుతమైన కథను తయారు చేశానని, త్వరలో సంజయ్‌ని కలిసి కథ చెప్తానంటున్నాడు. ఇక తెలుగులో తీసిన 'ఎ ఫిల్మ్ బై అరవింద్'ని బాలీవుడ్‌లోకి రీమేక్ చేస్తున్నానని, తెలుగులో షెర్లిన్ చోప్రా చేసిన పాత్రను బాలీవుడ్‌లో సన్నిలియోన్ చేస్తుందని ప్రకటించాడు. మరి తెలుగు ప్రేక్షకులను మెప్పించలేక పోయిన ఆయన బాలీవుడ్‌లోనైనా రాణించాలని కోరుకుందాం..!