తెలుగులో తనదైన అందాలతో నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి టాప్ హీరోస్ తో నటించిన బాలీవుడ్ నటి టబూ. నిజానికి ఆమె తన తెరంగేట్రం ది గ్రేట్ దర్శకేంద్రుని దర్శకత్వంలో 'కూలీ నెంబర్1'లోనే ఎంట్రీ ఇచ్చి తన నటనతో కాకుండా గ్లామర్‌తో అదరగొట్టింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నాగార్జునతో 'నిన్నేపెళ్లాడతా'లో పండుగా నటించి, దానినే ముద్దుపేరుగా మార్చుకుంది.
ఇక ఆమె ఆ తర్వాత కూడా 'ఆవిడా మా ఆవిడే, పాండురంగడు, అందరివాడు' వంటి చిత్రాలలో నటించింది. ఇప్పుడు నటిగా వయసు మీరడంతో తన వయసుకు తగ్గ పాత్రలను చేస్తోంది. నాగార్జునతో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆమె ప్రస్తుతం ఆయన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్.. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న చిత్రంలో అఖిల్‌కి అమ్మగా నటిస్తోన్నట్లు వార్తలు వచ్చాయి.
ఇందులో కూడా నిజం ఉందనే చెబుతోంది ఈ బ్యూటీ. తనకు బాలీవుడ్ నటిగా పేరున్నప్పటికీ తనకు గుర్తింపు మాత్రం దక్షిణాది వల్లే ఒచ్చిందని ఆమె ఒప్పుకోవడం హర్షణీయం. వాస్తవానికి ఈమె హైదరాబాదీనే. నాటి హీరోయిన్ ఫరాకు సోదరి. ఈ అక్కాచెల్లెళ్లిద్దరు వెంకీ సరసన నటించడం విశేషం. ఇక 45ఏళ్లు వచ్చినా ఈమె పెళ్లి చేసుకోలేదు. తనకు నచ్చినవాడు దొరకలేదని, అలాంటి వారు దొరక్కపోతే పెళ్లే చేసుకోనని చెబుతోంది.
యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి ఆలోచనలు, కోర్కెలు ఇప్పుడు ఉండవు కదా...! అని వాస్తవం చెప్పింది. ఇక తన వయసుకు తగ్గ పాత్రలనే చేస్తున్నానని, ఈ వయసులో గ్లామర్ పాత్రలను చేయలేను కదా..! అని తన వయసుకు గౌరవం ఇస్తూ మాట్లాడుతోంది. తాను ఈ స్థాయిలో ఉండటానికి తన కోస్టార్స్, మేకర్సే కారణమని, దానిని నా టాలెంట్‌గా మాత్రమే చెప్పుకోనంటోంది. అఖిల్ చిత్రం విషయాలు మాత్రం సస్పెన్స్ అంటూ, దక్షిణాదిలో ఒక హీరోతో తనకు ఎఫైర్ అంటగట్టడం చాలా బాదించిందని తన మనసులోని ఆవేదనను మాటల రూపంలో తెలిపింది.