మొత్తానికి కృష్ణవంశీలో ఇంకా సత్తా ఉందో లేక ఆ వయసు పెరిగే కొద్ది ఆవిరయ్యే క్రియేటివ్ డైరెక్టర్లయిన మణిరత్నం, కె.యస్.రవికుమార్, పి.వాసు, కె.విశ్వనాథ్, దాసరి, పెద్ద వంశీల సరసన చేరుతాడో తేలే రోజు దగ్గరపడింది. నానా ఇబ్బందులు పడుతూ, వాయిదాల మీద వాయిదాలు పడుతూ అదిగో జూన్, అదిగో జులై అంటూ ఊరించిన కృష్ణవంశీ 'నక్షత్రం' ముహూర్తం ఖరారైంది. మొదట ఈ చిత్రాన్ని ఈనెల 21న రిలీజ్ చేస్తారని భావించారు.
కానీ అదే రోజున మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న 'ఫిదా' చిత్రం రిలీజ్ ఉండటంతో తేదీని మరో వారం వాయిదా వేశారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. ఇక కృష్ణవంశీలోని నాటి 'గులాబి, సింధూరం, ఖడ్గం, నిన్నేపెళ్లాడతా, సముద్రం, అంత:పురం, చందమామ' తర్వాత ఆయన ఫేడవుట్ అయ్యాడు. రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' కూడా ఆయన్ను కాపాడలేకపోయింది.
ఇక తాజాగా 'నక్షత్రం' టీజర్లను, ట్రైలర్‌ని చూస్తుంటే కృష్ణవంశీ తనదైన సాంగ్స్ పిక్చరైజేషన్‌ని, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, శ్రియా శరన్‌ల అందాల ఆరబోత, అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇక ఆయన సందీప్ కిషన్ కంటే సాయి ధరమ్ తేజ్‌నే ఎక్కువగా నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఇక అదే రోజున ఇప్పుడు గోపీచంద్-సంపత్ నందిల భారీ అంచనాలున్న 'గౌతమ్ నంద' విడుదలవుతోంది. ఒకరు మెగా కాంపౌండ్ హీరో సాయిని నమ్ముకుంటే గోపీచంద్, సంతప్ నందిలు ప్రిస్టేజియస్‌గా తీసుకున్న పవన్ పాత్ర పేరతో 'గౌతమ్ నంద' వస్తోంది.
ఇక తన కెరీర్‌లో అత్యంత ఎక్కువ గ్యాప్ ఇచ్చిన గోపీ ఈ చిత్రంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. మరోవైపు తనకు 'విఐపి'కి అనువాదమైన 'రఘువరన్ బిటెక్' మాత్రమే సోలో విజయంగా ఉన్న దనుష్ ఈసారి బాలీవుడ్ నటి కాజోల్‌ని, అమలా పాల్‌లను తీసుకుని అదే రోజున 'విఐపి2'గా వస్తున్నాడు. వీటిల్లో 'గౌతమ్ నంద'పైనే అందరికీ ఎక్కువ ఆసక్తి ఉన్నది అనేది మాత్రం వాస్తవం.