నేడున్న యువతరం హీరోలు, దర్శకనిర్మాతల నుంచి అందరిలో కలుపుగోలుతనం.. ఒకరికి మరొకరు సహాయం చేసుకోవడం, ఒకరికొక్కరు ప్రోత్సాహం అందించుకోవడం వంటి మంచి పోకడ కనిపిస్తుండటం నిజంగా అభినందనీయం. అందరూ స్పోర్టివ్ స్పిరిట్‌తో ఒకరిని మించి మరోకరు హిట్ కొట్టాలని కసిగా పనిచేస్తున్నారు. కొందరు దర్శకులైతే తామే సొంతంగా నిర్మాణసంస్థలను స్థాపించి, తమ శిష్యులకి, వేరే ఇతర దర్శకులలోని ప్రతిభను వెలికితీస్తున్నారు.
ఇక వైవిధ్యభరితమైన చిత్రాలతో కొనసాగుతున్న నిఖిల్ కూడా ఈ కోవలోకే వస్తాడు. 'స్వామిరారా' నుంచి 'కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ' వంటి చిత్రాలను కొత్తతరం దర్శకులతో చేసి హిట్లు కొడుతున్నాడు. 'కేశవ' పెద్ద హిట్ కాకపోయినా సేఫ్ ప్రాజెక్ట్‌గానే నిలిచింది. కాగా ప్రస్తుతం ఈ యువహీరో మరో పెద్ద హిట్‌కొట్టేందుకు మంచి కాంబినేషన్స్‌ని సమకూరుస్తున్నాడు. మరో కొత్త దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి అనే యువకుడిలోని టాలెంట్‌ని మెచ్చి ఆతనితో మొదటి చిత్రం చేయడానికి సిద్దమైపోతున్నాడు.
అంతేకాదు. ఈ చిత్రానికి తాను దర్శకులు పరిచయం చేసిన దర్శకులను కూడా పనిచేయడానికి ఒప్పించాడు. 'స్వామిరారా'తో దర్శకునిగా మారి, 'కేశవ'తో ఫర్వాలేదనిపించుకున్న సుధీర్‌వర్మ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నాడు. ఇక తాను 'కార్తికేయ' ద్వారా పరిచయం చేసిన చందుమొండేటి ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నాడు. కాగా నిఖిల్ గతంలో స్వామిరారాతో పరిచయం చేసిన సుధీర్‌వర్మతో నాగచైతన్య 'దోచెయ్' చేశాడు.
'కార్తికేయ'తో పరిచయమైన చందుమొండేటితో 'ప్రేమమ్' చేశాడు. దీంతో ఈ సినిమాతో శరణ్ కొప్పిశెట్టి హిట్ కొట్టడమే తర్వాతి చిత్రం కూడా నాగచైతన్యతో కన్‌ఫర్మ్ అయినట్లే అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ 11వ చిత్రంగా నిర్మించనుండగా, కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహించనున్నారు. సో... ఈసినిమా ద్వారా దర్శకుడినే కాదు.. కొందరు నటీనటులను కూడా నిఖిల్ పరిచయం చేయడానికి రెడీ అయినట్లే అని చెప్పవచ్చు.