సాధారణంగా ఓ చిత్రం గురించి చెప్పాలంటే... అందునా ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, స్టార్ హీరో సినిమా స్టార్టింగ్‌కి ముందే మాట్లాడాలంటే.. ఆ అర్హత ముగ్గురికే ఉంటుంది. ఒకరు హీరో, రెండు నిర్మాత, మూడోది దర్శకుడు.. కానీ ఈ ముగ్గురు కాకుండా నాలుగో వ్యక్తి నుంచి ఆ చిత్రం విశేషాలు తెలుసుకోవడం, అందునా అతను క్రియేటివ్ జీనియస్ కావడం మరింత ఆస్తికరం. ఖచ్చితంగా చిరంజీవి నటించే 151వ ప్రతిష్టాత్మక 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' గురించి తాజాగా 'దర్శకుడు' ఆడియోలో చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డిలు కాకుండా ఈ చిత్రంపై సుకుమార్ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఈ చిత్రం గురించి వేడుకకు చరణ్, సురేందర్‌రెడ్డిలు ఇద్దరు రావడంతో కాస్త ఎగ్జైట్‌అయిన సుకుమార్ మాటలు మెగాభిమానులకు ఆసక్తిని కలిగించాయి. సుకుమార్ మాట్లాడుతూ, దర్శకుడు సురేందర్‌రెడ్డి, నేను దాదాపు ఇండస్ట్రీకి ఒకేసారి పరిచయం అయ్యాం. నా 'ఆర్య' విడుదలైన తరువాతి సంవత్సరం అదే తేదీన సురేందర్‌రెడ్డి 'అతనొక్కడే' విడుదలై ఘన విజయం సాదించింది. మేమిద్దరం మంచి స్నేహితులం.
నేను నా కథలను కొద్ది కొద్దిగా చెప్పి తప్పించుకునే వాడిని, కానీ సురేందర్‌రెడ్డి మాత్రం నన్ను బాగా నమ్మి కథలంతా చెప్పేసేవాడు. నాకు నెరేషన్ పెద్దగా రాదు. కానీ సురేందర్‌రెడ్డి బాగా నెరేట్ చేయగలడు. ఆయన ఎంతో ఆవేశంగా 'అతనొక్కడే' కథ నాకు చెబుతుంటే నువ్వు చెబుతున్నట్లు తీస్తే ఖచ్చితంగా హిట్టుకోడతావ్ అని చెప్పాను. అనుకున్నట్లే సురేందర్‌రెడ్డి పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత మరలా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథను చెబుతుంటే 'రంగస్థలం 1985 ' సెట్లోని అందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆయన కథ చెప్పినట్లే తీసి ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టబోతున్నాడు... అంటూ తన మనసులోని మాటను సుకుమార్ బయటకి చెప్పేశాడు.