వాస్తవానికి ఒకప్పటి జూనియర్ ఎన్టీఆర్‌కి, ఇప్పటి జూనియర్‌కి అసలు పోలికే లేదు. నాడు గర్వంగా ఫీలవుతూ, ఫ్యాన్స్ మీద కూడా విరుచుకుపడేవాడు. ఇక అందరిలానే మీడియాను నా తక్కువ చేసి చూసేవాడు. తనను జూనియర్ అని సంబోధిస్తే, బుడ్డోడు అని ఆప్యాయంగా పిలిచినా సరే, గుడ్డలూడదీసి కొడతానని మీడియాతో అనడమే కాదు... దానినే తన సినిమాలో డైలాగ్‌గా కూడా చెప్పాడు. అసలు 'ఆంధ్రావాలా' టైంలో అంటే 'ఆది, సింహాద్రి'లు వచ్చిన తర్వాత చిరంజీవా? కాదు..నేనే నెంబర్‌వన్ అన్నాడు. కానీ వరుస పరాజయాలు, పెళ్లి కావడం, మనసు పరిపక్వత సాధించడంతో కాస్త తేడా వచ్చింది.
తనకోసం ఎక్కడి నుంచో వచ్చే అభిమానులకు సమయం కేటాయించి మరీ, ఫొటోలు గట్రాతో పాటు యోగక్షేమాలు అడుగుతున్నాడు. బాబాయ్ మౌనంగా ఉన్నా పట్టుదలకు పోకుండా బాబాయ్‌ని అవకాశం ఉన్నప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. కెరీర్ ప్రారంభంలో కళ్యాణ్‌రామ్ ఎవరు? అని ప్రశ్నించిన ఆయన ఇప్పుడు బాగా దగ్గరై 'కిక్2' సందర్భంగా ఆర్దికసాయంతో పాటు ఆయన బేనర్‌లో 'జై లవకుశ' చేస్తున్నాడు. ఇక వారం కిందట విడుదలైన ఈ చిత్రంలోని టీజర్‌లో 'జై'గా నత్తితో మాట్లాడి కేకపెట్టించాడు. తనలోని నటుడిని బయటకు తీస్తే తనో సింహమని నిరూపించాడు.
ఇక 'జై' టీజర్‌ని చూసిన అభిమానులు, సామాన్యులే కాదు.. రాజమౌళి, రాఘవేంద్రరావులు కూడా ఆయన్ను ఆకాశానికెత్తేశారు. ఒక సినిమా ప్రమోషన్‌ని ఎలా చేస్తే అంచనాలు వస్తాయో అదే చేశాడు జూనియర్. కాగా ఇక ఈనెలాఖరులో 'లవ' టీజర్, ఆ తర్వాత వారం గ్యాప్‌లో 'కుశ' క్యారెక్టర్ ను కూడా పరిచయం చేస్తూ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. ఒకవైపు పూణెలో ఈ చిత్రం షూటింగ్‌తో పాటు 'బిగ్‌బాస్'షోలో పాల్గొంటూ రెంటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. మరోపక్క బాబి కూడా సినిమా షూటింగ్‌తో పాటు టీజర్‌లను కట్ చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ ఆదివారం నుంచి 'బిగ్‌బాస్'షో ప్రారంభం కానుంది. సో.. ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ లో ఎంత మార్పు అనిపిస్తుంది కదా..!