వరుస చిత్రాల విజయంతో నాని దూకుడు మాములుగా లేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలను లైన్లో పెడుతూ శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సినిమాలు విడుదల చేస్తున్న నాని అంతే వేగంగా హిట్స్ తన జేబులో వేసుకుంటున్నాడు. మొన్నటికి మొన్న 'నేను లోకల్' అంటూ విజయకేతనం ఎగురవేసిన నాని తాజాగా 'నిన్ను కోరి'తో క్లాసికల్ హిట్ ను అందుకున్నాడు. 'నిన్నుకోరి' చిత్రం నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధిస్తూ విజయపరంపర కొనసాగిస్తుంది.
ఇక 'నిన్నుకోరి' విడుదల కాకముందే దిల్ రాజు నిర్మాతగా 'ఎంసీఏ' చిత్రాన్ని పట్టాలెక్కించాడు నాని. ఈ చిత్రం షూటింగ్ సైలెంట్ గా శరవేగంగా జరుపుకుంటుంది. అసలిప్పుడు టాలీవుడ్ లో దర్శకనిర్మాతలకు బెస్ట్ ఆప్షన్ గా నాని కనబడుతున్నాడు అంటే నానికున్నక్రేజ్ ఏమిటో అర్ధమవుతుంది. ఇక 'ఎంసీఏ' చిత్ర లోగోని ట్విట్టర్ లో విడుదల చేసిన నాని ఇప్పుడు మరొక మూవీని అప్పుడే పట్టాలెక్కించే పనిలో పడడమే కాదు దానికి సంబందించిన టైటిల్ లోగో ని కూడా విడుదల చేసాడు.
వెంకట్ బోయినపల్లి నిర్మాణంలో మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో నాని చెయ్యబోతున్న చిత్రం టైటిల్ ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ టైటిల్ వినడానికి ఎంతో ఆసక్తికరంగా వుంది. మరి ఈ మధ్య నాని విభిన్న టైటిల్స్ తోనే హిట్స్ కొడుతున్నాడు. అందుకే తన తదుపరి చిత్రానికి ‘కృష్ణార్జున యుద్ధం’ అనే టైటిల్ ని సెలెక్ట్ చేసుకున్నాడు నాని. ఇకపోతే ఈ చిత్రంలో నాని రెండు పాత్రల్లో కనిపిస్తాడేమో.... అందుకే ఇలా కృష్ణ, అర్జున అంటూ టైటిల్ లో పెట్టారంటున్నారు. ఇక ఈ చిత్రానికి 'ధృవ' చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా మ్యూజిక్ అందించనున్నాడు.