నేడు వస్తున్న పలు వారసుల కంటే సాయికుమార్ తనయుడైన ఆది ఫర్వాలేదనే చెప్పాలి. తాత, తండ్రి, బాబాయ్ వంటి వారి నుంచి వారసత్వంగా వచ్చిన మంచి కంఠస్వరంతో పాటు పర్సనాలిటీ పరంగా కూడా ఆది బాగానే ఉంటాడు. కానీ ఆయన కెరీర్ 'ఆది' నుంచి ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. ఏవో రెండు మూడు సినిమాలు తప్ప.. మిగతా అన్ని సినిమాలు ఆది ని గర్వంగా నిలబెట్టలేకపోయాయి.
కుటుంబం మొత్తం సినీ పరిశ్రమతో అనుబందం, అనుభవం ఉన్నవారే అయినా కథల ఎంపికలో ఆయన ఏమాత్రం మెప్పించలేకపోతున్నాడు. పోనీ తన తండ్రి నిర్మించిన 'గరం' అయినా ఆడిందంటే అదీ లేదు. బాగా నష్టాలను మిగిల్చింది. ఏంటో ఆ ఫ్యామిలీనే అంత...! ఆయన తాత పిజెశర్మ హీరో కావాలని వచ్చి చిన్న చిన్న పాత్రలకు, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారాడు. సాయికుమార్‌ది అదే పరిస్థితి. ఆయనలో కూడా ఎంతో నటనా ప్రతిభ ఉందని అందరూ మెచ్చుకుంటారు. 'పోలీస్‌స్టోరీ' చూసిన వారు ఔరా అన్నారు. ఇక్కడ ప్రస్థానం, ఎవడుతో పేరొచ్చినా అవకాశాలు రాలేదు. తాను డబ్బింగ్ చెప్పిన సుమన్, రాజశేఖర్‌లు క్లిక్ అయ్యారే గానీ ఆయన క్లిక్ కాలేదు.
ఇక రవిశంకర్ గాత్రంతో ఆకట్టుకున్నా 'అరుంధతి' ఛాయల నుంచి బయటపడలేదు. ఇక అయ్యప్ప శర్మ దర్శకునిగా ఉసూరుమనిపించాడు. కేవలం ఈ కుటుంబం అంతా తెరవెనుక ప్రతిభను చాటుకున్నారే గానీ తెరపై చాటుకోలేదు. సాయి హీరోగా 'శ్లోకం' వంటి చిత్రం చేసినా 'శోకం' మాత్రమే మిగిలింది. ఇక ఇప్పుడు ఆది పరిస్థితి అలాగే ఉంది. కానీ నిన్నటివరకు ఆదిని ఆది పూడిపెద్ది అని పిలిచేవారు. ఉన్నది ఒక్క ఆదే కాబట్టి ఆది అంటే గుర్తుపట్టేవారు. కానీ సడన్‌గా రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది తమిళం నుంచి తెలుగులోకి విలన్‌గా ఎంటరై ఇమేజ్ తెచ్చేసుంటున్నాడు. ఎప్పటినుంచో ఉన్న ఆది అక్కడే ఉంటే ఆది పినిశెట్టి మాత్రం విలన్‌గా, సపోర్టింగ్ నటునిగా మెగాఫ్యామిలీ అండతో రెచ్చిపోతున్నాడు. దీంతో అసలు ఆది పరిస్థితి ఇబ్బందిగా మారింది.
ఓ దర్శకుడు తన పేరు చిన్నదిగా రెండక్షరాలతోనే ఉందని అనడంతో తన పేరు పక్కన తన తండ్రి పేరు తెచ్చుకుని ఆది సాయికుమార్ అని మార్చుకున్నానంటున్నాడు. కానీ ఆది పినిశెట్టి వల్లనే పేరు మార్చుకోవాల్సి వచ్చిందనేది ఇన్‌సైడ్ టాక్. ఇక వీరి కుటుంబానికి కులం ఆటంకంగా మారిందంటారు. మరి తాజాగా రిలీజ్ అయిన 'శమంతకమణి' లో ఆది నటనకు మంచి పేరొస్తుంది. దీనితో అయినా ఆది ఇకపై మంచి సినిమాలు చేసి.. స్టార్ హీరోగా ఎదిగి...సాయికుమార్ కలల్ని నిజం చేస్తాడేమో చూద్దాం.