ఏదైనా ఓపెన్‌గా మాట్లాడటంలో గానీ, కుండ బద్దలు కొట్టినట్లుగా తమ అభిప్రాయాలను చెప్పడంలో గానీ, ఫ్లాప్ సినిమాని ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి ఎంతో ధైర్యం, తెగువ, ఇగోలు లేకపోవడం, హిపోక్రసీకి దూరంగా ఉంటేనే వస్తాయి. ఆ విషయంలో మొన్నటి తరంలో సూపర్ స్టార్ కృష్ణ, నిన్నటి తరంలో నాగార్జున, జగపతి బాబులను ప్రత్యేకంగా చెప్పాలి. తాజాగా జగపతి బాబు తన 'పటేల్‌సార్' గురించి మాట్లాడుతూ 'నిర్మాత సాయికి గుల పుట్టి కాదు.. నాకు జిలపుట్టి కాదు' అన్న తరహాలో తాను హీరోగా చేస్తుండటంపై వ్యాఖ్యలు చేశాడు.
ఇక 'గాయం' వంటి సినిమా ఎందుకు చేయలేదు..? అంటే అలా తీసే దర్శకులేరీ? అని ప్రశ్నిస్తాడు. ఇక ఆయన విలన్‌గా, క్యారెక్టర్, సపోర్టింగ్ యాక్టర్‌గానే తనకు నటన పరంగా, ఆర్దికంగా బాగుందని ఓపెన్‌గానే చెబుతూ వస్తున్నాడు. ఇక ఆయనను తాజాగా మీకు నచ్చిన ఈ తరం హీరోలు ఎవరు? అని అడిగితే అందరిలా మభ్యపెట్టే మాటలు గానీ, దాటవేయకుండా అల్లు అర్జున్ పేరు చెప్పాడు. ఎందుకంటే బన్నీ మెగా ఇమేజ్‌కి దూరంగా ఉంటూ తనదైన టాలెంట్ చూపిస్తున్నాడని, అతని డ్యాన్స్, నటన, స్టైల్, కష్టపడే తత్వం వంటివి తనకిష్టమన్నాడు.
ఇక ఆతర్వాత తనకు నాని అంటే మంచి అభిప్రాయం ఉందని చెప్పాడు. సాధారణంగా ఎవరైనా సరే.. తాము ఇంతకు ముందు నటించిన చిత్రాల హీరోలను, తనకు అవకాశాలిస్తున్న హీరోలను పొగుడుతారు. కానీ జగ్గూ మాత్రం తాను ఇప్పటి వరకు కలిసి నటించని బన్నీ, నానిల పేర్లు చెప్పడం గ్రేట్. ఇక తన ప్రస్తుత కెరీర్ బాలీవుడ్‌లో అమితాబ్ కెరీర్‌లాగా సాగుతోందని, ఆయనంటే తనకు భలే ఇష్టమని అన్నాడు.
ఆయన లాగే లేట్ వయసులో విభిన్న పాత్రలు చేస్తున్నాను. ఆయన వయసులో పెద్ద వయసు పాత్రలు చేసినా హీరోలాగే ఉంటారు. వాయిస్‌పరంగా, కెరీర్ గ్రోత్ పరంగా ఆయనకు నాకు చాలా పోలికలున్నాయంటూ ముగించాడు. మరి జగ్గూ నుంచి సర్టిఫికేట్ అంటే బన్నీ,నానిలు ఆనందపడాల్సిందే.