మలయాళ ఇండస్ట్రీ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. స్టార్ హీరో దిలీప్ మీద పెట్టిన పెట్టుబడులన్నీ పోవడంతో మలయాళ నిర్మాతలు లబోదిబో అంటున్నారు. దిలీప్ కుమార్ అరెస్ట్ వలన అక్కడ ఇండస్ట్రీ అతలాకుతలం అయ్యింది. నటి భావన కిడ్నాప్ కేసులో రెండు రోజుల క్రితమే అరెస్ట్ అయిన దిలీప్ కుమార్ ఆ కేసుతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. భావన పై కక్ష సాధింపు చర్యలో భాగంగా కిరాయి గుండాలకు కోటిన్నర ఇచ్చి భావనపై లైంగికంగా వేధించమని వారిని పురమాయించినట్టు రుజువులు దొరకడంతో దిలీప్ ని పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు హీరో దిలీప్ మెడకు మరో కేసు చుట్టుకోబోతున్నట్లు చెబుతున్నారు. అదేమిటంటే కళాభవన్ మణి హత్య విషయంలో దిలీప్ కి సంబంధం ఉన్నట్లు అనుమానాలు మొదలయ్యాయి. కళాభవన్ మణి తెలుగులో వెంకటేష్ జెమిని చిత్రంలో విలన్ గా నటించి మెప్పించిన నటుడు. ఇంకా చాలా తెలుగు సినిమాల్లో కనబడిన కళాభవన్ మణి గత ఏడాది హత్యకి గురయ్యారు. మణి, విష ప్రయోగానికి గురై చనిపోయినట్లు వైద్యులు అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కళాభవన్ మణి కి హీరో దిలీప్ కి గతంలో భూముల విషయంలో గొడవలు జరగడం ఆ గొడవలు జరిగిన కొన్నాళ్లకే మణి హత్య గావింపబడడంతో దిలీప్ పై మణి సోదరుడు రామకృష్ణన్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
కళాభవన్ మణి హత్య కేసులో దర్శకుడు బైజు కొట్టరక్కర కూడా దిలీప్‌కు సంబంధం ఉందని అంటున్నారు. ఈ విషయం గురించి కొన్ని ఆధారాలను సీబీఐకి అప్పగించినట్టు కూడా బైజు వెల్లడించారు. మరి ఈ కేసు కూడా దిలీప్ మీద రుజువైతే ఇక దిలీప్ బ్రతికినన్నాళ్ళు జైల్లో చిప్పకూడు తినాల్సిందే అంటున్నారు మలయాళ పెద్దలు.