ఈనెల 16 నుంచి తెలుగులో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్‌బాస్'పై అందరి దృష్టి ఉంది. తమిళంలో కమల్ హొస్ట్ చేస్తున్న ఈ షోపై నిరసనలు వెల్లువై, తమిళసంప్రదాయాలను మంటగలుపుతున్నారంటూ కొన్ని సంఘాలు పోలీస్ స్టేషన్లలో కేసులు, హైకోర్టులో పిటిషన్లు వేసి, కమల్‌ని అందులో పాల్గొంటున్నవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇక తెలుగులో ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్‌గా చేయడం ఆయన భవిష్యత్తుకు మంచింది కాదని తెలంగాణ ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ అన్నారు. నందమూరి ఫ్యామిలీ అంటే తెలుగులో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న కుటుంబమని, ఆ కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ చేస్తే ఆయన ఆ కుటుంబం పరువు తీసినట్లవుతుందని ఆయన పేర్కొన్నాడు.
ఎందరో స్టార్స్ ఈ కార్యక్రమం చేయడానికి నిరాకరించిన తర్వాతే ఇది ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందని, పారితోషికం గూర్చి ఆలోచించిన ఎన్టీఆర్ ఈ షో చేస్తే మాత్రం పాపులారిటీ పోవడం గ్యారంటీ అని తేల్చిచెప్పారు. ఇక ఈ షోలో పాల్గొనే 12 మంది వ్యక్తులు ఈ నెల 13న పూణెలోని బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే పోసాని కృష్ణమురళి, మంచు లక్ష్మి, రంభ, స్నేహ, సదా..వంటి వారి పేర్లు బయటికి వచ్చాయి.
తాజాగా కమెడియన్ ధన్‌రాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, ముమైత్ ఖాన్, శ్రీముఖి వంటి వారి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఈ షో ఈనెల 16న ప్రారంభమైన తర్వాత ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచిచూడాల్సివుంది....!