టాలీవుడ్‌లో కూడా డ్రగ్స్ బానిసలు ఉన్నారని, నేడు ఇండస్ట్రీలో రేవ్ పార్టీ కల్చర్ నడుస్తోందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సురేష్ బాబును అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని పాలదోలాలని వారు పిలుపునిచ్చారు. తమ వద్ద డ్రగ్స్ వాడుతున్న 15 మంది స్టార్ ఇమేజ్ ఉన్న నటీనటుల లిస్ట్ ఉందని తెలిపారు. పిల్లి కళ్లు మూసి పాలుతాగి తనను ఎవ్వరూ చూడటం లేదనే భ్రమలో ఉంటుందని, డ్రగ్స్ అలవాటు ఉన్నసినీ ప్రముఖులు కూడా తాము డ్రగ్స్ వాడుతున్న విషయం ఎవ్వరికీ తెలియదని భావిస్తున్నారని, కానీ వారెవ్వరో తమందరికీ తెలుసునని అల్లు అరవింద్ తెలిపారు.
డ్రగ్స్ మహమ్మారిని రూపు మాపడం సామాజిక బాధ్యతగా ఆయన గుర్తు చేశారు. ఇండస్ట్రీలోని కొత్తతరం నటీనటులు దీనికి బాగా అలవాటుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా డ్రగ్స్‌ని అందుకుంటున్నారో కూడా తమకు తెలుసని,వారి ప్రతి కదలికకు సంబంధించిన వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని, కానీ కేవలం వారి భవిష్యత్తు, కెరీర్ నాశనం అవుతుందనే ఒకే ఒక్క కారణం వల్ల తాము మౌనంగా ఉన్నామని తెలిపారు.
ఇలాంటి కొంత మంది వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకే చెడ్డపేరు వస్తోందని, డ్రగ్స్‌తో ఎవ్వరూ తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నేడు డ్రగ్స్ విషయాలను ప్రభుత్వాలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయని, కాబట్టి ఇప్పటికైనా ఆ మహ్మమారి నుంచి బయటపడాలని సూచించారు. సినిమా పరిశ్రమ.. ఇందులోని వారు సమాజానికి ఆదర్శంగా నిలవాలే కానీ ఇలాంటి అలవాట్లతో చెడ్డపేరు తేవద్దని, వాటిని మానకూడదని భావిస్తే తమంతట తాముగా పరిశ్రమను విడిచిపెట్టి వెళ్లాలని హెచ్చరించారు.
ఈ అంశం చాలా సున్నితమైనదని, కాబట్టి దానిపై సున్నితంగా వ్యవహరిస్తున్నామని సురేష్ బాబు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ పెద్దలు డ్రగ్స్‌పై దృష్టి పెట్టడం సంతోషనీయం. ఇక రవితేజ సోదరుడు భరత్ రాజ్ మరణం తర్వాత ఇండస్ట్రీలోనే కాదు... అన్నిచోట్లా డ్రగ్స్‌పైనే చర్చ తీవ్రంగా నడుస్తోంది.