మెగాస్టార్ చిరు కామ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' హిట్టిచ్చి చాలాకాలం కావొస్తుంది. ఈ లోపు బుల్లితెర మీద 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ సందడి చేసిన చిరు తన 151 వ సినిమా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'నిమొదలు పెట్టడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ సినిమాని వచ్చే నెల అంటే ఆగష్టు 22 న చిరు బర్త్ డే కానుకగా లాంచ్ చెయ్యాలని డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ లు భావించారు. అందుకు అనుగుణముగానే స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది ఉయ్యాలవాడ యూనిట్.
అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అంటున్నారు. మెగా స్టార్ చిరు ఉయ్యాలవాడ చిత్రాన్ని ఆగష్టు 15 న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా లాంచ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఉయ్యాలవాడ సినిమా స్వతంత్ర ఉద్యమ కాలం నాటి కథతో తెరకెక్కుతుంది కాబట్టి ఆగష్టు 15 న సినిమాని పూజ కార్యక్రమాలతో లాంచ్ చేస్తే సినిమాకి మరింత హైప్ వస్తుందని ఉయ్యాలవాడ యూనిట్ భావిస్తోందట.
ఇక సినిమా లాంచ్ అప్పుడే... అందులో నటించే నటీనటుల పేర్లు కూడా అనౌన్స్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఆగష్టు 15 న సినిమా లాంచ్ చెయ్యడం అనేది చిరంజీవి చేతుల్లోనే ఉందంటున్నారు. చిరు ప్రస్తుతానికి భార్య సురేఖ తో అమెరికా ట్రిప్ లో ఉన్నాడు. ఆయన వచ్చిన వెంటనే చిరు పర్మిషన్ ఇస్తే ఉయ్యాలవాడ ఖచ్చితంగా ఆగష్టు 15 నే సెట్స్ మీదకెళుతుందని అంటున్నారు.