నేడు తెలుగులో నాటి స్టార్ హీరోయిన్లే నేడు యువ హీరోలకు తల్లులుగా, అత్తలుగా నటిస్తున్నారు. దాని వల్ల క్రేజ్ వచ్చినా సినిమాలలో తెలుగుదనం మాత్రం మిస్సవుతోంది. అనేక మంది పరభాషా నటీమణులే ఇలాంటి పాత్రలు చేస్తుండటంతో మొనాటనీ వస్తోంది. కాగా కొందరు కొన్ని కావాలని ఇండస్ట్రీకి వచ్చి మరేదో అవుతుంటారు. రవితేజ, నాని, రాజ్‌తరుణ్ వంటి వారు దర్శకులు కావాలని వచ్చి హీరోలు అయ్యారు.
తనికెళ్ల భరణి, ఎల్బీశ్రీరాం, కృష్ణ భగవాన్,పోసాని వంటివారు రచయితలుగా వచ్చి నటులయ్యారు. నటుడు, దర్శకుడు కావాలని ఆశించిన ఆర్ పి పట్నాయక్ సంగీత దర్శకుడు అయ్యారు. అలా చెప్పుకుంటే కోలీవుడ్‌లోని విజయ్ ఆంటోని, ప్రభుదేవా, లారెన్స్, రాజు సుందరం, టి. రాజేందర్, పార్దిబన్, భాగ్యరాజా, సంగీత దర్శకుడు, ఏ ఆర్ రెహ్మాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ వరకు ఎందరో ఉన్నారు.
రాజమౌళి కూడా ఎడిటింగ్ కోసం, సునీల్ మరోదాని కోసం.. ఇలా వచ్చారు. కానీ వారు ఒక స్థాయిలో నిలబడిన తర్వాత తమ కోరికలను తీర్చుకుని ముచ్చట పడే వారు కూడా కో కొల్లలు. తాజాగా 'పెళ్లిచూపులు'తో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. కాగా ఆయన తల్లికి నటనంటే మక్కువ. గతంలో తరుణ్ భాస్కర్ తీసిన షార్ట్ ఫిలింలో కూడా నటించింది.
ఈమె పేరు గీతా భాస్కర్. ఆమెలోని టాలెంట్‌ని గుర్తించిన శేఖర్ కమ్ముల సాదారణంగా తన చిత్రాలలో నేటివిటీని చూపించడమే కాదు.. కొత్తవారిని బాగా ప్రోత్సహిస్తాడు. దాంతో శేఖర్ తాజాగా వరణ్ తేజ్‌తో దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన 'ఫిదా' చిత్రంలో ఈమెకు నిండైన అత్త పాత్రని ఇచ్చాడట. అంతేకాదు.. ఈ చిత్రం విడుదలైతే ఈమె తరుణ్ భాస్కర్ తల్లి అని కాకుండా ఈమె కొడుకు తరుణ్ బాస్కర్ అనేలా ఆమెకు పేరు వస్తుందని ఘంటాపదంగా చెబుతుండటంతో ఆమె పై ఆసక్తిమొదలైంది. ఈ చిత్రం కనుక హిట్టయితే తెలుగు పరిశ్రమకు అచ్చమైన తెలుగు అత్త లభించినట్లే భావించాలి.