బాలకృష్ణకు సినిమాలలో పవర్‌ఫుల్ డైలాగ్‌లు చెబుతాడనే పేరున్నా కూడా వేదికలపై, లైవ్‌లలో, ఇతర ప్రసంగాల నుంచి ప్రెస్‌మీట్ల వరకు తడుముకుని మాట్లాడుతాడని, ఏదో మాట్లాడబోయి ఏదేదో మాట్లాడుతాడనే విమర్శ ఉంది. కానీ ఇప్పుడు బాలయ్య బాగా మారి, తన వాక్చాతుర్యం పెంచుకున్నాడనే అనిపిస్తోంది. బాలయ్య హీరోగా శ్రియ, హేమమాలిని ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'డబ్బింగ్ వెర్షన్‌ను తాజాగా చెన్నైలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాలయ్య చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. ఇక్కడి నీరే తాగాను.. ఇక్కడి గాలే పీల్చి పెద్దయ్యాను... అంటూ బాలయ్య స్వచ్చమైన తమిళంలో ప్రసంగించాడు. తనకు ఎంజీఆర్ పెదనాన్న అని, శివాజీ గణేషన్ చిన్నాన్న అంటూ చెప్పాడు. ఇక 'వీర పాండ్యకట్టబొమ్మన్' చిత్రంలో శివాజీ గణేషన్ చెప్పిన డైలాగులను స్వచ్చమైన తమిళంలో అనర్ఘంగా చెప్పడంతో చప్పట్లు మారుమోగిపోయాయి.
'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం ఓ ప్రాంతీయ చిత్రం కాదని, అది దేశం మొత్తం గర్వించదగిన ఓ మహావీరుని కథ అని, ఈ చిత్రాన్ని తాము దేశంలోని అన్నిభాషల్లో రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక క్రిష్ గతంలో తెరకెక్కించిన 'వేదం' చిత్రం డబ్బింగ్ కూడా తమిళంలో ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తమిళ హీరో కార్తితో పాటు క్రిష్, సంగీత దర్శకుడు చిరంతన్ భట్ కూడా పాల్గొన్నారు.