గతంలో బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌పై బయోపిక్ చేస్తానన్నాడు. దీనికి బాలయ్యే డైరెక్ట్ చేస్తాడని ఈ చిత్రంతోనే తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. ఇక బాలయ్య కాకుంటే పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడని, పూరీ కూడా స్క్రిప్ట్ పనిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌కి తుదిరూపం ఇచ్చే బాధ్యతను దర్శక రచయిత దేవకట్టాకి ఇచ్చాడని తెలుస్తోంది.
ఎలాంటి వివాదాల జోలికి పోకుండా కేవలం ఎన్టీఆర్ గొప్పతనాన్ని చెప్పేలా దేవకట్టా స్క్రిప్ట్ రెడీ చేశాడట. కాగా గతంలో తన తండ్రి బయోపిక్‌లో తన తండ్రి పాత్రను తానే చేస్తానని బాలయ్య చెప్పాడు. మరి బాలయ్య నటించే బయోపిక్ పూరీదా? లేదా దేవకట్టాదా? అనే విషయంలో సస్పెన్స్ నెలకొని ఉంది. మరోవైపు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ తీయనున్నానని ప్రకటించాడు. దీంతో బాలయ్య చేయబోయే ఎన్టీఆర్ బయోపిక్, వర్మ బయోపిక్‌లు వేర్వేరని అంటున్నారు.
కాగా బాలయ్య, ఎన్టీఆర్ బయోపిక్‌ని తనకి తెలిసిన సబ్జెక్ట్‌తో వివాదరహితంగా తీయనున్నాడని, కానీ వర్మమాత్రం లక్ష్మిపార్వతి రాసిన ఎన్టీఆర్ నిజజీవిత కథ, ఆనాడు ఆసుపత్రి పాలైన తర్వాత ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు, జెమిని టీవీలో ధర్మపీఠంలో ఎన్టీఆర్ చెప్పిన సంగతులు మీద ఆధారపడి తీస్తాడని, ఇందులో వర్మ ఎన్టీఆర్‌ని పొగుడుతూనే ఆయన వెనుక జరిగిన కుట్రలు, వెన్నుపోటు వంటివాటిని చూపించనున్నాడని అంటున్నారు. మరి ఈ సస్పెన్స్‌కి తెరపడేది ఎప్పుడో...? బాలయ్య, వర్మలు నోరు విప్పితే గానీ అసలు విషయం తెలియదు...!