అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా, దిల్‌రాజు నిర్మాణంలో హరీష్‌శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'డిజె' (దువ్వాడ జగన్నాథం) విషయంలో రివ్యూ రైటర్స్, యాంటీ ఫ్యాన్స్ గురించి చిత్రం యూనిట్ ఆచితూచి స్పందించలేదు. తమలపాకుతో తానిట్టంటే.. తలుపు చెక్కతో నేనిన్నట్టనా.. అన్నచందంగా ఫ్యాన్స్‌ని కూల్ చేయాల్సిందిపోయి దిల్‌రాజు, హరీష్‌శంకర్, బన్నీలు అగ్నికి మరింత ఆజ్యం పోశారు. తలాతోకా లేని వాదనలతో అందరినీ టార్గెట్‌చేశారు. దాంతో యాంటీ ఫ్యాన్స్‌తో పాటు బ్రాహ్మణులు, కమ్మవారు కూడా అవసరం లేకుండానే తమను కెలికినందుకు నెగటివ్ కామెంట్స్‌తో దుమ్మెత్తిపోశారు.
ఇక ఓవర్‌సీస్‌లో ఇది దారుణమైన ఫలితం పొందింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం టాక్‌కి సంబంధం లేకుండా వీకెండ్‌తో పాటు, రంజాన్ వరకు 'డిజె' హవా నడిచిందనడంలో సందేహం లేదు. ఆ తర్వాత కలెక్షన్లు పడిపోయాయి. అంతటితో ఆగకుండా దర్శకుడు హరీష్‌శంకర్ తమ చిత్రం మొదటివారంలోనే 100కోట్లు వసూలు చేసిందని, ఇక నైజాంలో నాన్-బాహుబలి రికార్డులను తిరగరాసిందని, దీనిపై ఎవరితోనైనా సవాల్‌కి సిద్దమేనని గర్జించాడు. తాము చెప్పే వసూళ్లన్ని నిజమైనవేనని తేల్చారు. అదే నిజమైతే 'డిజె' బ్లాక్‌బస్టర్ అని చెప్పాలి.
ఇంతకు ముందు ఉన్న నాన్-బాహుబలి రికార్డులు చిరంజీవి 'ఖైదీనెంబర్ 150' పేరుపై ఉన్నాయి. అంటే చిరు సినిమాని మించి, ఆ రికార్డులను కొల్లగొట్టి 'డిజె' ముందంజలో ఉందని చెప్పుకోవాల్సిందే. కానీ ఇది నిజం కాదని మెగాఫ్యాన్స్ వారే మండిపడుతున్నారు. నైజాం నుంచి 20కోట్లకు పైగా షేర్ వస్తే 'డిజె' ఖైదీని దాటినట్టే.. కానీ ఈ విషయాన్ని ఎత్తితే మాత్రం డిజె యూనిట్ సైలెంట్ అయిపోయింది.
తొలివారం ముగియకుండానే 100కోట్ల కలెక్షన్ల పోస్టర్స్‌ని 'డిజె' కోసం ప్రింట్ చేశారనే వార్తలను పలు ఇంగ్లీషు జాతీయ దిన పత్రికలు పేర్కొన్నాయి. దీంతో 'ఫిదా' ఆడియో వేడుక కోసం హైదరాబాద్ వచ్చిన మెగాభిమానులు 'డిజె' ఎలా 'ఖైదీ నెంబర్ 150' రికార్డులను బ్రేక్ చేసిందో లెక్కలతో సహా చూపించాలని ఈ చిత్ర నిర్మాత, నైజాం డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన దిల్‌రాజుని నిలదీయడంతో వారికి సర్ధిచెప్పలేక దిల్‌రాజు నానాహైరానాపడి ఎట్టకేలకు మెగాభిమానులను సముదాయించి బుజ్జగించాడట...! చిరుని టార్గెట్ చేస్తే మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా..మరి!