పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న మూడో చిత్రంపై విపరీతమైన అంచనాలున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదంటున్నారు. కారణాలేమైనాగాని ఈ చిత్రం వచ్చే సంక్రాంతి బరిలో ఉంటుందని మాత్రం చెబుతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే జోరందుకుంది.
దానిలో భాగంగానే పవన్ చిత్రం శాటిలైట్ రైట్స్ రికార్డు రేటుకు అమ్ముడు పోయినట్లు సమాచారం అందుతుంది. సన్ నెట్ వర్క్ వాళ్ళు రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని కేవలం తెలుగు శాటిలైట్ హక్కులని 19.5 కోట్లకు కొనుగోలు చేసిందని చేబుతున్నారు. ఇవి కేవలం తెలుగు ఒక్కదానికే అట. ఇక మిగిలిన తమిళ, మలయాళ శాటిలైట్ హక్కులు ఉండనే ఉన్నాయంటున్నారు. మరి పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ అనేసరికి ఈ చిత్రానికి ఎక్కడలేని క్రేజ్ రావడమే కాకుండా త్రివిక్రమ్ సినిమాల్ని బుల్లితెర హిట్స్ అన్న పేరు ఉండనే వుంది.
త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఏ చిత్రమైన బుల్లితెర మీద సూపర్ హిట్టే. అలాగే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఏదైనా ఒక చిత్రాన్ని బుల్లితెర మీద ఎన్నిసార్లు ప్లే చేసినా.. దానికి రేటింగ్స్ ఎప్పటికీ హైలోనే ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. ఇకపోతే మురుగదాస్ - మహేష్ కాంబినేషన్ లో వస్తున్న 'స్పైడర్' చిత్రానికి కూడా అన్ని భాషలకు కలిపి శాటిలైట్ హక్కులకు 25 నుంచి 30 కోట్ల పలికిందని అన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిత్రం కేవలం ఒక్క తెలుగులోనే ఇంత భారీ ధర పలకడం అనేది మాత్రం ఒకరికార్డే అంటున్నారు.