అప్పుడెప్పుడో అవార్డు ఫంక్షన్ కి వెళ్లిన 'పెళ్లి చూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తమ సినిమాకి అవార్డ్స్ రాకపోవడంపై కడుపుమండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై టంగ్ స్లిప్ అయినట్లు వార్తలొచ్చాయి. ఆ సమయంలో తరుణ్ భాస్కర్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చెయ్యడం వంటివి చాలానే జరిగిపోయాయి. అసలు 'పెళ్లి చూపులు' చిత్రం చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకున్న 'పెళ్లిచూపులు' చిత్రానికి ఒక అవార్డు ఫంక్షన్ లో అవార్డ్స్ ఇవ్వకుండా ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' కి ఇవ్వడం వలన 'పెళ్లి చూపులు' డైరెక్టర్ భాస్కర్... ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' విషయంలో ఏదో మాట్లాడాడని మీడియాలో రకరకాల వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
అయితే తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ కలిసి ప్రముఖ ఛానెల్ లో ఒక షోకి హాజరవగా అక్కడ ఒక ఫ్యాన్ తరుణ్ భాస్కర్ ని మీరు 'పెళ్లి చూపులు' చిత్రానికి అవార్డు రాలేదని ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడారు.... మీరు అలా అనుకుంటే అసలు 'పెళ్లి చూపుల'కి అన్ని అవార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నించగా... దానికి తరుణ్ భాస్కర్ నేను ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అండి. అలాగే ఆయన్ని తప్పుబట్టే అంతటి స్ట్రాటజీ నాకు లేదు అని చెప్పాడు. అలాగే నేను ఆయన సినిమా మొదటి రోజు మొదటి షో చూస్తాను. అది కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే చూస్తాను... ఆయన 'రాఖి' సినిమా విడుదలప్పుడు నేను పోలీస్ లతో లాటి దెబ్బలు కూడా తిన్నా అంటూ ఆ ఫ్యాన్ కి వివరణ ఇచ్చాడు.
నేను 'పెళ్లి చూపుల'కి ఆ అవార్డు ఫంక్షన్ లో అవార్డు రాలేదని బాధపడ్డాను కానీ, ఎన్టీఆర్ ని నేనేమి అనలేదని క్లారిటీ ఇచ్చాడు. కానీ మీడియా తప్పుగా అర్ధం చేసుకుని ఏదేదో రాసేసింది అని అన్నాడు. ఇంతలో ఆ షోకి హోస్ట్ గా చేస్తున్న రానా అందుకుని ఇదంతా వట్టి గాసిప్ అండి. అసలు ఇపుడు తరుణ్ తో ఎన్టీఆర్ కి ఫోన్ లైన్ కలుపుదామనుకున్నాం కానీ ఎన్టీఆర్ గారు ఊరిలో లేకపోవడం వలన కుదరలేదంటూ చెప్పుకొచ్చాడు.