ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' లోని 'జై' టీజర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టీజర్ ని అలా విడుదల చేశారో లేదో ఇలా టాలీవుడ్ ప్రముఖులంతా ఎన్టీఆర్ నటనను పొగుడుతూ అభినందించేసేశారు. 'జై' పాత్రలో తారక్ అద్భుతమైన నటన కనబర్చాడంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తునారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో మెరుస్తాడని తెలిసిన విషయమే. ఇందులో ‘జై’ క్యారక్టర్ రావణ భక్తుడి పాత్ర. ఈ టీజర్‌లో ఎన్టీఆర్‌ని నెగెటివ్ షేడ్‌లో చూపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ టీజర్ ని అందరూ ఆకాశానికి ఎత్తేస్తుంటే టాలీవుడ్ లో ఒక్క డైరెక్టర్ మాత్రం ఎన్టీఆర్ 'జై' టీజర్ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడట. అంతలా ఉలిక్కిపడిన డైరెక్టర్ మరెవరో కాదు ఎన్టీఆర్ తో 'టెంపర్' చిత్రాన్ని తెరకెక్కించిన పూరి జగన్నాధ్. అయితే పూరి అంతలా షాక్ అవడానికి ఒక బలమైన కారణమే ఉందట.
అదేమిటంటే పూరి, ఎన్టీఆర్ కలిసి గత డిసెంబర్ లో స్టోరీ డిస్కషన్స్ లో కూర్చున్నారట. ఆ స్టోరీలో ఐడియా ఇప్పుడు 'జై' టీజర్లో కనిపించిందని పూరి జగన్నాధ్ అనుమాన పడుతున్నాడంటూ పూరి సన్నిహితులు చెబుతున్నారు. నిజంగా అది నిజమని తెలిస్తే ఎన్టీఆర్ స్క్రిప్ట్ దొంగగా ముద్ర వెయ్యాల్సి వస్తుందని... పూరి 'పైసా వసూల్' సెట్స్ లో వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. అయితే నిజానికి ఎన్టీఆర్, పూరీ ఇద్దరూ గత డిసెంబరులో మీట్ అయినప్పుడు ఇలాంటి క్యారక్టర్ గురించే చర్చించారని.. ఇది కేవలం కాకతాళీయం కాకపోవచ్చునని పూరి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్టీఆర్ - పూరి కాంబినేషన్ లో గనక ఈ సినిమా తెరకెక్కితే గనక అది బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అయ్యేదని... కానీ పూరి, ఎన్టీఆర్ ల మధ్య కథ విషయంలో కొన్ని విభేదాలు వచ్చాయని వారంటున్నారు.
అయితే ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్‌కి ఎంతో నచ్చినా.. బ్యాక్‌గ్రౌండ్ స్టోరీలో కొన్ని మార్పులు చేయాలని పూరీని ఎన్టీఆర్ కోరాడట. కానీ దానికి పూరీ జగన్నాథ్ ఒప్పుకోలేదట. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కనబెట్టి తర్వాత చూద్దాం అన్నాడని అంటున్నారు. ఇక పోతే 'జై' టీజర్ ని చూసిన పూరి తాను గతంలో ఎన్టీఆర్ కి చెప్పిన ఐడియా లాగా ఉందని... తన ఐడియాను ఎవరో దొంగిలించి ఉండవచ్చునని భావిస్తున్నాడని కూడా చెబుతున్నారు. అయితే పూరి విషయంలో ఇలా స్టోరీ బయటికి వెళ్లిపోవడం కొత్త కాదని... అయినా రచ్చ చేయడం ఎందుకని పూరీ కామ్‌గా ఉండిపోయాడు అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నమాట.
కాకపోతే 'జై' టీజర్ ని చూసిన తర్వాత ఎన్టీఆర్ ఇలా ఎందుకు చేశాడో గాని ఇలా చెయ్యకుండా ఉండాల్సిందంటూ పూరి బాగా అప్సెట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయం 'జై లవ కుశ' డైరెక్టర్ బాబీ దగ్గరకి చేరడంతో... బాబీ నేను కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ అని.... పూరి మాటలు కొట్టిపడేస్తున్నాడట. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఒకటైన ‘జై’.. నా ఒరిజినల్ స్క్రిప్ట్‌లో ఓ భాగం.. బహుశా పూరీతో ఎవరైనా ఇలాంటి క్యారక్టర్ గురించి చర్చించి ఉండవచ్చు. కానీ ఆ విషయం నాకు తెలియదు. అయినా ఒకరికి క్లారి ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని... 'జై' టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్ చూసి తామంతా ఎంతో సంతోషపడుతున్నామని బాబీ చెప్పినట్టు తెలుస్తోంది.