సూపర్‌స్టార్ మహేష్‌బాబుకి ఆయన బావ గల్లా జయదేవ్ అంటే చాలా ఇష్టం. తను తన బావ గల్లా నుంచి స్ఫూర్తిపొందుతానని పలుసార్లు చెప్పాడు. ఇక తనకు రాజకీయాలు పడకపోయినా గుంటూరు నుంచి టిడిపి తరపున ఎంపీగా పోటీచేశాడు. పూర్తిగా టిడిపి అనుకూలంగా కాకుండా తాను ఎంతగానో అభిమానించే గల్లా జయదేవ్‌ని గెలిపించాలని నాటి ఎన్నికల్లో ట్విట్టర్ ద్వారా ప్రజలకు, తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
ఒకానొక సందర్భంలో 'శ్రీమంతుడు' కథకి తన బావే స్ఫూర్తి అని చెప్పాడు. ఇక ఆయన మరో బావ సుధీర్‌బాబు హీరోగా తెరంగేట్రం చేసిన తర్వాత ఏదో ఆయన వేడుకలకు ముఖ్యఅతిధిగా వెళ్లాడే గానీ జయదేవ్‌పై ఉన్న ఆసక్తిని సుదీర్‌బాబు విషయంలో తీసుకోవడం లేదనే వార్తలు కూడా వచ్చాయి. ఆయన తన బావ సుధీర్‌బాబును బాగా పొగిడింది... తన ఫ్యాన్స్‌ని ఆయన్ను ఆదరించమని చెప్పింది తక్కువే. ఇక ప్రస్తుతం సుధీర్‌బాబు, నారా రోహిత్, ఆది సాయికుమార్, సందీప్ కిషన్‌లతో కలిసి నటిస్తున్న 'శమంతకమణి' ఈనెల 14న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'భలే మంచి రోజు' షూటింగ్ సమయంలోనే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ స్టోరీలైన్ చెప్పాడని, స్టోరీని పూర్తి చేసిన తర్వాత ఇందులో ఏపాత్రలో నటిస్తారు అని అడిగాడని అన్నాడు.
మీ ఇష్టం వచ్చిన పాత్ర చేస్తాను అని చెప్పడంతో ఇందులో నటిస్తున్నానని, శ్రీరామ్ ఆదిత్య ఒక్క రోజు కూడా వేరే షూటింగ్‌ల సెట్స్‌కి రాకుండా, ఎవరి దగ్గర పనిచేయకుండానే ఇంత అద్భుతంగా సినిమాలు తీస్తున్నాడని, ఆయన గొప్ప డైరెక్టర్ అవుతాడని జోస్యం చెప్పాడు. తన మొదటి చిత్రానికి రెండో చిత్రానికి కూడా గ్యాప్ తీసుకున్నానని, ఇక 'బాఘీ' తర్వాత ఒకటిన్నర ఏడాది గ్యాప్ తీసుకుని ఈ చిత్రం చేస్తున్నానని తెలిపాడు.
ప్రస్తుతం నారా రోహిత్‌తో 'వీరభోగ వసంతరాయులు'లో పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నానని, విరించి వర్మ వద్ద పనిచేసిన రాజా దర్శకత్వంలో ఓ ప్రేమకథలో నటిస్తున్నానని తెలిపాడు. ఇక ప్రవీణ్ సత్తార్‌తో పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేస్తున్నానని, విదేశాల నుంచి మేకప్ మేన్స్‌ను తెప్పిస్తున్నామని, ఇక తన బావ మహేష్‌తో ఒక్క చిత్రమైనా చేయాలని ఉందని, ఎంత చిన్న పాత్ర అయినా ఒప్పుకుంటానంటున్నాడు. మరి ఆయన కోరిక మహేష్ తీరుస్తాడో లేదో వేచిచూడాల్సివుంది..!