పవన్‌కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రత్యక్షంగా పోటీ చేస్తుందని ప్రకటించాడు. దానికోసం ఉత్తరాంద్రతో పాటు అనంతపురం, తెలంగాణలోనూ క్యాడర్ నియామకం జరుగుతోంది. దీనికి మంచి స్పందన కూడా వస్తుండటం విశేషం. అయితే కేవలం పవన్ తనకు గెలుపు ముఖ్యం కాదని, యుద్దంలో పోరాడటమే ముఖ్యమని, తన కార్యకర్తలకు ధైర్యం నూరి పోసి యుద్దం బరిలోకి దింపే నాయకత్వమే ముఖ్యమని, ఇక సైనికుల్లో ఓటమి అనే నిరాశను దూరం చేయడమే నాయకత్వమని నమ్ముతున్నాడు. కాగా పవన్ ఇప్పటికే ఉద్దాన బాధితులు, పోలవరం, అమరావతి రైతు బాధితులు, మెగా అక్వా పార్క్, చేనేత వంటి పలు సమస్యలపై ట్విట్టర్ వేదికగా లేక ఏదో అలా వచ్చి ఇలా వెళ్లడమో చేస్తున్నాడు. ఇది ఒక రాజకీయ నాయకునికి పనికిరాదు.
యుద్దక్షేత్రంలోకి దూకే ముందే గెలుస్తామని కాదు అని ప్రశ్నించడానికే అని చెప్పడంతో జనసైనికులు నిరుత్సాహానికి గురవుతున్నారు. పవన్ కూడా కేవలం ట్విట్టర్‌కే పరిమితమవుతున్నాడు. దీంతో ఆయన మరింత మందికి తనను విమర్శించే అవకాశాన్ని, అస్త్రాన్ని చేజేతులా అందించారని పవన్ అభిమానులు కూడా అంటున్నారు. మరోవైపు వేరే పార్టీల నుంచి వచ్చేవారిని, వ్యక్తిగత అజెండాలతో వచ్చేవారికి తనపార్టీలో చోటులేదని చెప్పాడు. అలా పలువురు నాయకులు వ్యక్తిగత ఎజెండాతో ప్రజారాజ్యంలోకి రావడమే నాడు పెద్ద మైనస్ అయిందని, ఈసారి అలాంటి తప్పులు చేయనంటున్నాడు.
ఇక కోటీశ్వరులని పెట్టుకోకుండా, డబ్బు ఖర్చుపెట్టకుండా, ఇతర పార్టీలలోని రాజకీయ ఉద్దండులను ఢీకొట్టడం అంటే జరిగే పనికాదనే అంటున్నారు. కొత్తవారికి ప్రత్యేక వ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులు వేసి, సామాజిక సమీకరణాలను పోగుచేసే అనుభవం వారికి ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పవన్ ఇప్పటికీ కాపులను బిసీలలో చేర్చడం నుంచి ఎస్సీ వర్గీకరణ వరకు క్లారిటీ ఇవ్వలేదు. అలా చేస్తే కొన్ని వర్గాలు దూరమవుతాయనేది పవన్ భయం. గతంలో పీఆర్పీసమయంలో కూడా చిరు ఎస్సీ వర్గీకరణ, తెలంగాణలపై తన స్టాండ్ చెప్పకపోవడం బాగా మైనస్ అయింది.
ఇక ఎన్టీఆర్ 'తెలుగువారి ఆత్మగౌరవం'లా పవన్ వద్ద ఉద్వేగమైన నినాదం లేదు. ప్రత్యేకహోదా ఉన్నా దానిని జగన్ హైజాక్ చేసే పరిస్థితి ఉంది. నేడు టిడిపి, వైసీపీలు బలంగా ఉన్నందున ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయ శూన్యతలేదనే చెప్పాలి. ఇక పవన్ దక్షిణాదిఆత్మగౌరవ నినాదం ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు. 2004లో చిరు, జెపిలు కాంగ్రెస్ గెలవడానికి ఓట్లు చీల్చి ఉపయోగపడ్డారు. మరి పవన్ 2019లో టిడిపి, వైసీపీలో దేనికి మేలు చేస్తాడో వేచిచూడాల్సివుంది...!