ప్రారంభమై ఏడాది దాటినా మహేష్‌బాబు - మురుగదాస్‌ల 'స్పైడర్' ఇంకా పూర్తికాలేదు. సెప్టెంబర్ 27న విడుదలవుందని అంటున్నారు. మరోపక్క ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందుతోంది. పబ్లిసిటీ కోసమని ద్విభాషా చిత్రాలుగా రిలీజ్ అయ్యే చిత్రాలు చాలా సార్లు ఒకే భాషకు చెందిన నటీనటులతోనే కానిచ్చేసి డబ్బింగ్‌కి ఎక్కువ, స్ట్రెయిట్‌కి తక్కువ అన్నట్లు చేస్తారు.
కానీ 'స్పైడర్' విషయంలో మాత్రం మహేష్, మురుగదాస్‌లు రాజీ పడటం లేదు. తెలుగు, తమిళంలో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌ని తెలుగులో కొందరిని, తమిళంలో అక్కడ గుర్తింపు ఉన్నవారిని పెట్టుకున్నారు. డైలాగ్ డెలివరీ నుంచి పాటల వరకు ఎక్కడా డబ్బింగ్ చాయలు కనిపించకుండా, పెదాల కదలికలను కూడా ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రతిసీన్‌ని తెలుగులో ఒకసారి, తమిళంలో మరోసారి.. ఇలా రెండు భాషల్లో విడి విడిగా చిత్రీకరణ జరుపుతున్నారు.
మామూలుగా దక్షిణాది ఏభాషలోనైనా పాటలంటే వారంలో రెండు పాటలను చిత్రీకరిస్తారు. కానీ లిప్‌సింక్ కోసం ఈ చిత్రంలోని ఒక్కోపాట చిత్రీకరణకు వారం సమయం తీసుకుంటున్నారు. మొత్తానికి ఇది మహేష్‌బాబుకి కోలీవుడ్‌లో స్ట్రెయిట్ ఎంట్రీ ఇచ్చే తొలి సినిమా కావడంతో మహేష్, మురుగదాస్‌లు ఎక్కడా రాజీపడకుండా తెలుగు ప్రేక్షుల అభిరుచికి తగ్గట్టుగా తెలుగులో, తమిళ ప్రేక్షకులకు ఇది డైరెక్ట్ చిత్రం అనిపించేలా తీస్తున్నారట.
ఇక ఈ చిత్రం క్లైమాక్స్ కూడా రెండు భాషల్లో వేరు వేరని అంటున్నారు,. తెలుగువారికి తెలుగు సినిమాలా, తమిళులకి తమిళ చిత్రంగా ఫీలయ్యేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట...!