సింహం నాలుగడుగులు వెనక్కి వేసిందంటే భయపడి కాదు.. అంతకంటే రెట్టింపు వేగంతో రావడానికే అని రచయిత, నిర్మాత కోనవెంకట్ నిరూపించాడు. ఆయన చేసిన 'శంకరాభరణం', దానికి ముందే శ్రీనువైట్లతో అభిప్రాయ బేధాల వల్ల చాలా కాలంగా కోన మౌనంగా ఉన్నాడు. దీంతో ఇక కోన పనైపోయిందని, శ్రీనువైట్లతో చెడి ఇద్దరు విడిపోయారని, ఇక కోన లాభం లేదని సెటైర్లు వినిపించాయి. ఎప్పుడూ ఏదో ఒక ఆడియో ఫంక్షన్‌లోనో లేక వేడుకలోనో బిజీగా ఉండే కోన కనిపించి చాలాకాలం అయింది. ఈ గ్యాప్‌లో ఆయన ముంబై వెళ్లి శ్రీదేవికి, బోనీకపూర్‌కి 'మామ్' స్టోరీలైన్ చెప్పి వినిపించాడు. ఈ పాయింట్ వారికి బాగా నచ్చడంతో బోనీకపూరే నిర్మాతగా మారి, శ్రీదేవిని లీడ్‌రోల్‌కి తీసుకుని 'మామ్' నిర్మించాడు.
ఇక నాని నటించిన 'నిన్నుకోరి' చిత్రానికి కొత్త దర్శకుడు శివ నిర్వాణకి స్క్రీన్‌ప్లే, మాటలు అందించాడు. తాజాగా విడుదలైన ఈ రెండు చిత్రాలు మొదటి రోజు, మొదటి షోనుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. చాలాకాలం తర్వాత విడుదలైన మొదటి షోకే పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలు ఇవి. ఇక 'మామ్' వంటి కథను అటెమ్ట్ చేయడం, దానికి కమర్షియల్ టచ్ ఇవ్వడం, అసలు నిర్బయ ఘటన వంటి దానిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి తల్లిదండ్రి, పిల్లలు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు తమ భవిష్యత్తులో విపత్తులు ఏర్పడకుండా మెసేజ్ ఇచ్చిన ఈ చిత్రం సూపర్.
ఇక నాటి రాధాకళ్యాణం, అభినందన, మౌనరాగం తరహాలో చిత్ర కథ ఉన్నప్పటికీ చక్కని చిక్కని స్క్రీన్‌ప్లే, మాటలతో సాధారణ కథను కూడా అద్బుతంగా తీయవచ్చని కోనవెంకట్ నిరూపించాడు. ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్‌కి, సీన్లకి ప్రేక్షకులు కంటతడి పెడుతున్నారంటే అది నిజంగా కోన మ్యాజిక్ అనేచెప్పాలి. ఇలా ఈ శుక్రవారం కోనవెంకట్‌ను మరలా స్టార్‌గా నిలబెట్టిందని చెప్పవచ్చు. ఈ స్ఫూర్తితో ఆయన నుంచి మరిన్ని మంచి చిత్రాలను ఆశించడం అత్యాశేమీ కాదు...!