మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలలో చాలా వరకు నిజమయ్యాయి. ఆయన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కువగా బిజెపి హవా ఉందని తేల్చారు. కిందటి ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ బోణీ కొట్టలేదని, తెలుగుదేశం గెలుస్తుందని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే విజయమని ముందుగానే చెప్పాడు. ఆయన చెప్పినట్లే అన్నిచోట్లా జరిగింది. దీంతో లగడపాటి సర్వేలపై మంచి టాక్ ఉంది.
కాగా ఆయన తాజాగా ఐదు రోజుల పాటు నంద్యాల ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గంలో సర్వే చేయించాడు. ఇందులో టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోతాడని, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డే గెలుస్తాడని ఆ సర్వేలో తేలిందట. దీంతో తాజాగా తెలుగు తమ్ముళ్లలో భయం ఏర్పడింది. మొదటి నుంచి నంద్యాల ఉప ఎన్నికల విషయంలో చంద్రబాబు కాస్త అయోమయంగానే ఉన్నాడు. వైసీపీని ఒప్పించి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేశాడు. కానీ జగన్ పోటీ చేసే తీరుతామని స్పష్టం చేశాడు.
సాధారణంగా ఉప ఎన్నికలు అంటే అధికార పక్షానికి అనుకూలంగానే ఉంటాయి. అంతేగాక సిట్టింగ్ అభ్యర్ధి చనిపోతే ఆ పార్టీకే సానుభూతి పవనాలు బాగా ఉంటాయి. మొత్తానికి 2019 అసెంబ్లీ ఎన్నికలకు రిఫరెండంగా భావిస్తున్న ఈ ఉప ఎన్నికల్లో సానుభూతిని, అధికార ప్రభుత్వం అభ్యర్ధి బలాన్ని కూడా కాదని వైసీపీ గెలిస్తే అది టిడిపికి, బాబుకు షాక్ అవుతుందనే చెప్పాలి.