బాలీవుడ్‌లో మహిళ దర్శకుల డైరెక్షన్‌లో స్టార్ హీరోలు కూడా ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. కానీ మన టలీవుడ్‌లో మాత్రం మగాళ్లదే హవా. నేటి కమర్షియల్ హంగులైన యాక్షన్ సీన్స్, సినిమాకి అవసరమైన మసాలా అంటే శృంగారం ఒలకపోయించడం, డబుల్ మీనింగ్‌లు, ఇతర మాస్ అంశాలను మగ దర్శకులలా లేడీ డైరెక్టర్స్ తీయలేరని పలువురు భావిస్తారు. నాటి కాలంలో ఇలాంటి ప్రయోగాలను నాటి నటీమణులైన భానుమతి, సావిత్రి వంటి వారు చేశారు.
ఇక ఆ తర్వాత విజయ నిర్మల మాత్రమే దర్శకురాలిగా మారి అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకురాలిగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. తమకు సొంత నిర్మాణ సంస్థ ఉండటం, సూపర్‌స్టార్ కృష్ణ, సీనియర్ నరేష్‌లతో పాటు ఆమె బంధువులలో కూడా నటీమణులు ఉండటంతోనే అది సాధ్యమైంది. ఇక ఆతర్వాత రాజశేఖర్ శ్రీమతి జీవిత దర్శకత్వం వహించినా సక్సెస్ కాలేదు. రాజశేఖర్ వంటి హీరో ఉన్నా ఆమె దర్శకురాలిగా రాణించలేకపోయింది. ఇక బుల్లితెరపై సంచలనం సృష్టించిన మంజులా నాయుడు కూడా వెండితెరపై ఆకట్టుకోలేక పోయింది.
ఇప్పుడున్న మహిళా దర్శకుల్లో కాస్త బి.జయకి మాత్రమే అవకాశాలున్నాయి. ఈమెకి కూడా సినీ నిర్మాణ సంస్థ ఉండటం, ఆమెతో పాటు ఆమె భర్త కూడా జర్నలిస్ట్ కావడం, ఆమె భర్తకి, ఆమెకి సినీ పరిశ్రమలో మంచి పరిచయాలు, భర్త బి.ఎ.రాజు ఫేమస్ పీఆర్వో కావడం వంటివి ఆమెకి దోహదం చేస్తున్నాయి. త్వరలో ఆమె 'వైశాకం' రిలీజ్ కానుంది. ఇక నందిని రెడ్డి కూడా బాగానే ఆకట్టుకుంటోంది. తాజాగా కృష్ణవంశీ మరో శిష్యురాలు సౌజన్య నాగచైతన్యతో ఓ చిత్రం చేయనుందని వార్తలు వస్తున్నాయి.
మరోపక్క మణిరత్నం శిష్యురాలైన సుధా కొంగర హిందీలో 'సాలా ఖద్దూస్'ని అదే చిత్రాన్ని తమిళంలో కూడా తీసింది. తెలుగులో వెంకటేష్ నటించిన దాని రీమేక్ 'గురు'తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా విఘ్నేశివన్‌తో నటిస్తున్న చిత్రం తర్వాత స్టార్ సూర్యనే తన సొంత బేనర్‌లో సుధా కొంగర దర్శకత్వంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సుధా కొంగర దర్శకత్వంలో చేయడానికిగ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక రేవతి, శ్రీప్రియలు కూడా రాణిస్తున్నారు.