రీమేక్ చిత్రాలను చేయడం వల్ల ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా పొంచే ఉంటుంది. ఆల్‌రెడీ ప్రూవ్‌డ్ సబ్జెక్ట్ కాబట్టి మినిమం గ్యారంటీ ఉంటుందంటారు. కానీ ఆదే సమయంలో ఒరిజినల్ వెర్షన్‌లోని సోల్‌ని పట్టుకోకుంటే భారీ మూల్యం చెల్లించకతప్పదు. దానికి ప్రభాస్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ బ్లాక్‌బస్టర్ 'యోగి' మంచి ఉదాహరణ. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
మరోవైపు నేడున్నసాంకేతిక పరిజ్ఞానంతో ఓ చిత్రం రీమేక్ అవుతుందని తెలిస్తే, ఆ రీమేక్‌కి ముందే మన ప్రేక్షకులు సీడీలలో, ఆన్‌లైన్‌లో చూసేస్తుంటారు. ఒరిజినల్ చిత్రానికి రీమేక్ చిత్రానికి పోలికలు తెస్తుంటారు. ఇక విషయానికి వస్తే తమిళంలో రాజా దర్శకత్వంలో ఆయన తమ్ముడు జయం రవి, అరవింద్‌స్వామిలు నటించిన 'తని ఒరువన్' రికార్డ్సు క్రియేట్ చేసింది. దానిని రామ్‌చరణ్ తమిళ వెర్షన్‌లో విలన్‌గా నటించిన అరవింద్‌స్వామి స్థానంలో ఎవ్వరూ ఆపాత్రను పోషించలేరని భావించి, అరవింద్‌స్వామినే పెట్టుకుని గీతాఆర్ట్స్ పతాకంపై అల్లుఅరవింద్ నిర్మాతగా.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో దీనిని 'ధృవ'గా రీమేక్ చేశాడు. సరైన టైమింగ్‌లో రిలీజ్ కాకపోయినా ఈ చిత్రం మంచి విజయమే సాధించింది.
తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి కూడా రీమేక్ చేయనున్నారు. 'మున్నామైఖేల్' దర్శకుడు సబ్బీర్‌ఖాన్ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపొందనుంది. హీరోగా యంగ్‌హీరో సిద్దార్ద్‌మల్హోత్రా నటించనున్నాడు. కానీ విలన్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. అరవింద్‌స్వామికి బాలీవుడ్‌లో మంచి గుర్తింపే ఉన్నప్పటికీ ఈ పాత్రను నడి వయస్కుడిగా కాకుండా యంగ్‌గా చూపించాలనే ఉద్దేశ్యంతో అర్జున్ కపూర్‌ని పెట్టుకోనున్నారని సమాచారం.